కుల రహిత సమాజ స్థాపనకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొన్నేండ్లుగా ప్రత్యేక నగదు ప్రోత్సాహకం అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.50వేలుగా ఉన్న సాయాన్ని సీఎం కేసీఆర్ రూ.2.50లక్షలకు పెంచి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 65 జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. వీరందరూ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం కోసం ఎస్సీ అభివృద్ధి శాఖకు దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు 34 జంటలకు రూ.85 లక్షలను వారి పేరున వారి గ్రామ సమీపంలోని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను అందజేశారు. మరో 31 జంటలకు సాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పరిగి, ఏప్రిల్ 8: కుల రహిత సమాజ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అందజేసే ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. గతంలో వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకంగా రూ.50 వేలను అందించేవారు. ఆ డబ్బులు ఎప్పుడు వచ్చేది కూడా తెలియని పరిస్థితి నెలకొనేది. కాగా సీఎం కేసీఆర్ కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఆర్థిక తోడ్పాటుతోపాటు వారు ఏదైనా స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకొని తమ కాళ్లపై తాము నిలబడేలా ఈ ప్రోత్సాహకాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు. మూడేండ్ల తర్వాత తమ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు డ్రా చేసుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 65 జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. 2020-21లో 2, 2021-22లో 63 జంటలు కులాంతర వివాహాలు చేసుకొని, ప్రోత్సాహకం కోసం ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాయి.
కులాంతర వివాహం చేసుకున్న జంటకు అందజేసే ప్రోత్సాహకాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచింది. ఈ పెంచిన ప్రోత్సాహకం 2019 అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లా పరిధిలో 65 జంటలు కులాంతర వివాహాలు చేసుకుని ప్రోత్సాహకం కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకోగా.. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డబ్బుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. అందులో ఇప్పటివరకు 34 జంటలకు రూ.85 లక్షలు విడుదల కాగా.. సంబంధిత జంటలకు వారి పేరున వారి గ్రామ సమీపంలోని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేసి బాండ్లను అందజేశారు. మరో 31 జంటలకు ప్రోత్సాహకం డబ్బులు అందాల్సి ఉన్నది. విడుతల వారీగా నిధులు మంజూరు అవుతుండటంతో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు ముందుగా డబ్బులను అందిస్తున్నారు.
ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేసిన రూ.2.50 లక్షలు మూడేండ్ల తర్వాత కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ. మూడు లక్షల వరకు అందుతుంది. ఎస్సీ అమ్మాయి లేదా ఎస్సీ అబ్బాయి ఇతర బీసీ, ఓసీ, ఎస్టీ వారిని వివాహం చేసుకుంటే కులాంతర వివాహం కింద ప్రభుత్వం ఈ ప్రోత్సాహాకాన్ని అందిస్తుంది. రూ.2.50లక్షలను మూడేం డ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఈ మూడేండ్ల కాలం లో వడ్డీతో కలిపి సుమారు రూ.మూడు లక్షల వరకు నగ దు ఆ జంటలకు అందుతుంది. కులాంతర వివాహం చేసుకున్న వెంటనే డబ్బులను అందిస్తే ఆ జంటలు ఏమై నా గొడవలు జరిగి విడిపోయేందుకు అవకాశం ఉంటుం ది. అందువల్ల ఒకేసారి డబ్బులను ఇవ్వకుండా మూడేం డ్ల తర్వాత ఇవ్వడం ద్వారా ఆ జంటలు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించేందుకు ఆస్కారం ఉంటుం ది. తద్వారా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం, స్వయం ఉపాధి రంగాన్ని ఎంచుకుని ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది.
జిల్లా పరిధిలో 65 జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఆ జంటలు ప్రోత్సాహకం కోసం దరఖా స్తు చేసుకోగా పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రోత్సాహకం డబ్బుల మంజూరుకు ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఇప్పటివరకు 34 జంటలకు రూ.85 లక్షలను ప్రోత్సాహకంగా అందించడంతోపాటు, భార్యాభర్తల పేరున బ్యాంకు ల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లను అందించడం జరిగింది.