ఎఫ్‌సీఐ గోదాముల్లో నిండుగా బియ్యం నిల్వలు
దిగుమతుల కోసం రోజుల తరబడి పడిగాపులు
వ్యాగన్లు రాక.. గోదాముల వద్ద స్థలం లేక ఇబ్బందులు
బియ్యం బస్తాలతో నిలిచిపోతున్న లారీలు
ఉమ్మడి రంగారెడ్డి నుంచి సేకరణ 51శాత మే పూర్తి
మహబూబ్‌నగర్, చర్లపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాములకు మన బియ్యం తరలింపు
షాబాద్, డిసెంబర్ 22 : కేంద్ర ప్రభుత్వ వైఖరి రైతులకు శాపంగా మారుతున్నది. బియ్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకపోకపోవడంతో గోదాముల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీంతో బియ్యం స్టాకు పెట్టుకునే గోదాములు సరిపోక, మరోవైపు సేకరించే బియ్యం అధికంగా ఉండడంతో లారీల్లో తీసుకువెళ్లిన బియ్యం అన్లోడ్ చేయలేకపోతున్నారు. దీంతో దిగుమతుల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. కేంద్రం తీరుపై రైతులు మండిపడుతున్నారు.
ఇచ్చిన బియ్యం సకాలంలో తీసుకుపోరు, కొత్తది కొనరు ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గమైన విధానం. చేసే తప్పులన్నీ తాము చేసుకుంటూ నెపమంతా రాష్ట్రంపై మోపడం తప్ప మరో పని లేనట్లు కేంద్రం వ్యవహరిస్తున్నది. బియ్యం స్టాకు పెట్టుకునే గోదాముల సామర్థ్యం తక్కువ, మరోవైపు సేకరించే బియ్యం అధికంగా ఉండడంతో లారీల్లో తీసుకెళ్లిన బియ్యం సకాలంలో అన్లోడ్ చేయలేకపోతున్నారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి గత యాసంగి సీజన్లో సేకరించిన 51554 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మూడు బాయిల్డ్ రైస్‌మిల్లులకు కేటాయించారు. సీఎంఆర్ పూర్తైన తర్వాత 35056.72 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 17980 మెట్రిక్ టన్నులు(51శాతం) మిల్లర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 17076.72 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద నుంచి రావాల్సి ఉన్నది. రంగారెడ్డి జిల్లా నుంచి 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే గోదాముల్లోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని మిల్లర్ల ద్వారా వచ్చిన బాయిల్డ్ రైస్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలోని కౌకుంట్ల ఎఫ్‌సీఐ గోదాముకు తరలించాల్సి ఉంటుంది.
అక్కడ గోదాముల నిలువ సామర్థ్యం 70వేల మెట్రిక్ టన్నులు కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాల నుంచి సుమారు 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సదరు గోదాముకు చేరవేసేందుకు నిర్ణయించారు. సామర్థ్యం తక్కువగా ఉండడంతో గోదాములు బియ్యంతో నిండిపోయాయి. వాటిని వెంటనే ఖాళీ చేసి బియ్యం వ్యాగన్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఇబ్బంది ఉండకపోయేది. కాగా వ్యాగన్లు రావడం ఆలస్యం కావడం వల్ల బియ్యం లోడ్‌తో వెళ్లే లారీలు అన్లోడ్ చేసేందుకు ఇబ్బంది ఎదురవుతుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో కేటాయించిన ధాన్యం నుంచి సీఎంఆర్ తర్వాత 70 శాతం బియ్యం రాగా, 30 శాతం బియ్యం రావాల్సి ఉన్నది. చర్లపల్లిలోని ఎఫ్‌సీఐ, మహబూబ్‌నగర్ జిల్లాలోని కౌకుంట్ల గోదాములకు బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ తీసుకోకపోవడంతో మిల్లింగ్ మరింత ఆలస్యమవుతుందని చెప్పవచ్చు. అసలు పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వమే బియ్యం పాతవి ఇవ్వడం లేదంటూ లేనిపోని అభాండాలు వేస్తూ కేంద్రం కాలం వెళ్లదీస్తుంది. మరోవైపు యాసంగి బియ్యం కొనమంటూ మొండికేయడం విడ్డూరంగా ఉన్నది.