కామారెడ్డి టౌన్/ నిజామాబాద్ సిటీ, జనవరి 20: కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని, అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలు అందించాలని సూచించారు. గురువారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలు, వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందితో సర్వే బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వే బృందాలు ప్రతి ఇంటికెళ్లి కుటుంబంలో ఎవరైనా దగ్గు, జర్వంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలన్నారు. కొవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోం ఐసొలేషన్ కిట్ అందజేయాలని సూచించారు. మరుసటి రోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ఐదు రోజుల తర్వాత కూడా దగ్గు, జర్వంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని దవాఖానల్లో చేర్పించాలని ఆదేశించారు. గత అనుభవంతో ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ కామారెడ్డి జిల్లాలో 90 శాతం, రెండో డోసు 70 శాతం పూర్తయ్యిందన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టెస్టిం గ్, హోం ఐసొలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేకుంటే వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యంతోపాటు కొవిడ్ వార్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్ లక్షణాలు ఉన్న గర్భిణులకు స్థానికంగానే చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్లు ప్రభుత్వ దవాఖానల వైద్యులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు ప్రజలందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గతంలో కొవిడ్ నియంత్రణ కోసం నిర్వహించిన ఇంటింటి సర్వే సత్ఫలితాలు ఇచ్చిందని, ఈ కార్యక్రమాన్ని నీతిఆయోగ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని గుర్తుచేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొవిడ్‌తో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో కొవిడ్ ఎక్స్‌గ్రేషియా కోసం ఇప్పటి వరకు 606 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 470 పరిశీలించి పరిష్కరించినట్లు వివరించారు. 136 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నారా యణరెడ్డి తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సినేషన్ 97శాతం పూర్తయ్యిందని చెప్పారు.