కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వేళ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. సొంతూళ్లకు వెళ్లేవారు బస్సులు, ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు అధికారులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పీహెచ్‌సీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. కరోనా టెస్టులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వీయనియంత్రణతోనే కరోనాను కట్టడి చేయగలమని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 13 : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అంతేకాకుండా పండుగ పూట కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయగలమని వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్ వాడడం, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించడం వంటి చర్యలతో వీలైనంత వరకు కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చని వైద్యారోగ్య శాఖ అధికారులు ఊరూరా అవగాహన కల్పిస్తున్నారు. ఒమిక్రాన్‌తోపాటు కరోనా థర్డ్ వేవ్‌తో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ ఎవరికి వారు అప్రమత్తంగా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో వారం, పది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జ్వరం తదితర లక్షణాలున్న ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేసేందుకు నిర్ణయించి, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా పరీక్షలను వీలైనంత ఎక్కువ పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజుల కిందటి వరకు రోజుకు 300-400లుగా ఉన్న కరోనా పరీక్షల సంఖ్య ప్రస్తుతం భారీగా పెంచారు. అంతేకాకుండా జిల్లాకు అవసరమైన కరోనా పరీక్షల కిట్స్‌ను జిల్లా వైద్యారోగ్య శాఖ అన్ని పీహెచ్‌సీల్లోనూ అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా పాజిటివ్ నిర్దారణ అయిన వారి కాంటాక్ట్స్‌ను గుర్తించి వారికి పరీక్షలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
రోజుకు 4 వేల మందికి పరీక్షలు…
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్యను జిల్లా వైద్యారోగ్య శాఖ భారీగా పెంచింది. గత వారం రోజుల వరకు 300-400లుగా ఉన్న కరోనా పరీక్షల సంఖ్య ప్రస్తుతం ఏకంగా 3500-4000 వరకు ప్రతీరోజు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. కరోనా పరీక్షలకు అవసరమైన కిట్స్‌ను కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అన్ని పీహెచ్‌సీల్లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. స్వల్ప లక్షణాలున్న కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు.
వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ…
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. సెకండ్ డోస్, 15-18 ఏళ్లలోపు వారికి, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 118 శాతం మేర పూర్తికాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వీలైనంతా త్వరగా పూర్తి చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమని వైద్యారోగ్య శాఖ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే సెకండ్ డోస్ వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నారో సంబంధిత వ్యక్తులందరికీ వ్యక్తిగతంగా వారి ఫోన్ నెంబర్లకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్‌వో కార్యాలయంలోని కాల్ సెంటర్ ద్వారా మెసేజ్‌లు పంపుతున్నారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు 19,41,721 మందికి పూర్తికాగా, మరో 4,34,801 మందికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. అదేవిధంగా 15-18 ఏళ్లలోపు పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతమైంది. గత పది రోజుల్లో జిల్లావ్యాప్తంగా 78.006 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. అంతేకాకుండా బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జిల్లాలో వేగమందుకుంది. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన గత మూడు రోజుల్లో 6499 మందికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
అడుగడుగున అప్రమత్తత…
పరిగి, జనవరి 13: కరోనా పంజా విసురుతున్న వేళ మరింత అప్రమత్తత అవసరమని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓవైపు ఎక్కడికక్కడే పరీక్షలు జరిపి కోవిడ్ నిర్దారణ జరిగితే వైద్యం అందించడంతోపాటు ముందు జాగ్రత్తలలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేశారు. వికారాబాద్ జిల్లా కర్ణాటక సరిహద్దుకు ఆనుకొని ఉండడంతో పక్క రాష్ట్రం నుంచి వస్తున్న వారిలో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే కొవిడ్ పరీక్ష జరుపుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోను కోవిడ్ పరీక్షలు జరిపించడం ద్వారా కరోనా కట్టడికి సర్కారు చర్యలు చేపట్టింది. జిల్లాలోని సర్కారు ఆసుపత్రులలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచారు. సంక్రాంతి పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు వేలాది మంది వస్తున్న తరుణంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
కరోనా పరీక్షలు…
వికారాబాద్ జిల్లాకు ఆనుకొని కర్నాటక రాష్ట్రం ఉంటుంది. తద్వారా కర్నాటక నుంచి హైదరాబాద్‌తోపాటు జిల్లాలోని తాండూరు, కొడంగల్ ప్రాంతాలకు నిత్యం కర్నాటకవాసులు వస్తుంటారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో సైతం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో కర్నాటక నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహించి ఏమాత్రం లక్షణాలు ఉన్నా కరోనా పరీక్షలు జరుపుతున్నారు. ఇందుకుగాను తాండూరు మండలం కొత్లాపూర్, కొడంగల్ నియోజకవర్గంలోని కర్నాటక సరిహద్దులో గల రావులపల్లిలో ప్రత్యేకంగా వైద్య బృందం ఏర్పాటు చేయడం జరిగింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోను ప్రత్యేకంగా కోవిడ్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇవేకాకుండా జిల్లాలోని తాండూరు జిల్లా ఆసుపత్రి, పరిగి, కొడంగల్, వికారాబాద్, మర్పల్లి సీహెచ్‌సీలు, 22 పీహెచ్సీలలోను కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.ప్రతిరోజు సుమారు 4వేల పైచిలుకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
వేగంగా వ్యాక్సినేషన్…
కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో వేగవంతం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోసు 100శాతం మందికి పూర్తవ్వగా రెండవ డోసు 3,53,697 మందికి ఇవ్వడం జరిగింది. ఈనెల 3వ తేదీ నుంచి 15 నుంచి 17 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటివరకు ఈ వయసు వారికి 14,135 మందికి మొదటి డోసు కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేశారు. మరోవైపు హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ఈనెల 10వ తేదీ నుంచి ప్రికాషనరీ డోసు వేయడం ప్రారంభమవ్వగా ఇప్పటివరకు 2018 మందికి ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్ వేశారు.
అప్రమత్తంగా ఉండండి…
పండుగ పూట ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడుతూ, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోన కేసులు పెద్దగా లేనప్పటికీ పండుగ సమయం కావడంతో పట్టణ ప్రాంత ప్రజలు ఊర్లకు వస్తున్న దృష్ట్యా కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. మరోవైపు జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని, జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షలను కూడా నిర్వహిస్తున్నామన్నారు.