వేల్పూర్, జనవరి 22:‘ఆరోగ్య సిబ్బంది మీ ఇంటికి వచ్చారా.. సర్వే చేశారా..’అంటూ పలు కుటుంబాలకు ఫోన్ చేసి తెలుసుకున్నారు రాష్ట్ర మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శనివారం చేపట్టిన సర్వేను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే తీరుపై ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ఆరోగ్య సిబ్బంది దగ్గర వివరాలను తీసుకున్న మంత్రి స్వయంగా ఫోన్ ద్వారా పలు కుటుంబాలతో మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే చేశారా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి వారికి ఉచితంగా మందులు అందజేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. అధైర్యపడొద్దన్నారు. మంత్రి వెంట మండల వైద్యుడు అశోక్, ఆరోగ్య సిబ్బంది, సర్పంచ్ వర్షిణి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.