
అక్కన్నపేట, జనవరి 19 : ఒకే ఫసల్‌లో రెండు పంటలు పండిస్తూ లాభాల బాటలో దూసుకెళ్తున్నారు అక్కన్నపేట మండలంలోని రైతన్నలు. ప్రభుత్వం యాసంగిలో వరికి బదులు అరుతడి పంటలను వేసుకోవాలని సూచిస్త్తుండగా, వ్యవసాయశాఖ అధికారులు వరి, మక్కజొన్న కాకుండా అంతర్గత, ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో గోవర్ధనగిరి, రేగొండ, ఇప్పలపల్లి, మల్‌చెర్వుతండా, మసిరెడ్డితండా, ధర్మారం, నందారం, అంతకపేట, కేశవాపూర్, కట్కూరు తదితర గ్రామాల్లోని రైతులు ఆ దిశగా పంటలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అంతర్గతంగా..
మండలంలో పలువురు రైతులు మామిడి తోటలు, పత్తి, మక్కజొన్న పంటల్లో అంతర్గతంగా అరుతడి పంటలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, కందులు, నువ్వులు, ఆముదం, శెనగ, పెసర, మినుము, బబ్బెర్లు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇతరత్రా కూరగాయలను సాగు చేస్తున్నారు.
ఆరుతడి పంటలే మేలు..
వరి, మక్కజొన్న తదితర వాటితో పోల్చితే ఆరుతడి పంటల సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. తక్కువ విస్తీర్ణం, సమయం, నీరు, పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. అలాగే, పంట సాగు ఖర్చు తగ్గి, ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది. పంటలలో చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. నేలలో భూసారం పెరుగుతుంది. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా పండించిన ఉత్పత్తులకు ప్రభుత్వ మద్దతు ధర లభిస్తోంది.
గతేడాది పొద్దుతిరుగుడు, ఈయేడు పల్లికాయ..
మాకు రెండెకరాల మామిడి తోట ఉంది. అయితే, అంతర్గత పంటగా గతేడాది పొద్దుతిరుగుడు పంట వేసినం. ఇప్పుడు వేరుశనగ వేసి ఇరువై రోజులు దాటింది. కలుపునకు వచ్చింది. బాయి కాడ ఉన్న ఇంకో ఎకరంన్నరలో వరి వేద్దామనుకున్నం. ఇప్పుడు వరివేయొద్దు అని సర్కార్ చెబుతున్పటికీ, వరి వేస్తే తరువాత ఇబ్బందులు పడాల్సివస్తది. దీంతో పొద్దుతిరుగుడు పెడదాం అనుకుంటున్నం. ఊకే ఒకే పంట కూడా వేయొద్దు. దిగుబడి వత్తలేదు. ఓ సారి పత్తి, ఓ ఫసల్ పొద్దుతిరుగుడు, పెసర్లు, ఓ సారి పల్లికాయ, కూరగాయలు, ఉల్లిగడ్డ పెట్టడమే మంచిది.