నిజామాబాద్ సిటీ, జనవరి 20: ప్రభుత్వం నిర్దేశించిన ఇంటింటి ఆరోగ్య సర్వేను పక్కాగా చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను వందశాతం పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. తన చాంబర్ నుంచి గురువారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ అవుట్ పేషెంట్ విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వసతులను మెరుగుపర్చుకోవాలని సూచించారు. మాక్లూర్‌లో ఐసొలేషన్ సెంటర్‌ను పునఃప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే బృందాలు జ్వరం, జలుబు, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెడికల్ కిట్ అందజేయాలని అన్నారు. కొవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్నవారిని ఏరియా, జిల్లా ప్రభుత్వ దవాఖానాలకు రిఫర్ చేయాలని అన్నారు. దవాఖానల్లో కొవిడ్ వార్డులను సరిచూసుకొని అన్నివిధాలా సిద్ధం చేయాలని, కొవిడ్ కేసులు ఎన్ని వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అంబులెన్సులు, ఆక్సిజన్, అవసరమైన మందులు, బెడ్లు వంటి సదుపాయాలను మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు.
ఆంగ్లంలో పద్యాలు రాయడం అభినందనీయం
నందిపేట్ ఆదర్శ పాఠశాలకు చెందిన 24మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్ల పద్యాలు రాయడం అభినందనీయమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. విద్యార్థులు రచించిన ఇంగ్లిష్ పద్యాలు బ్లూమింగ్‌బర్డ్స్ ఆంగ్ల అంతాలజీ పుస్తకంలో ముద్రించగా ఆ పుస్తకాలను గురువారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించి శిక్షణ ఇచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌ను కలెక్టర్ అభినందించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్ పద్యాలు రచించేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో వినోద్‌కుమార్, చిన్నయ్య, రామకృష్ణ, రవికుమార్,నర్సయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.