నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 22: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జ్వర సర్వే కొనసాగుతున్నది. రెండో రోజైన శనివారం ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశక్యాకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసుకున్నారు. మెండోరాలో నిర్వహించిన ఫీవర్ సర్వేలో సర్పంచ్ మచ్చర్ల లక్ష్మి పాల్గొని గ్రామస్తులందరూ వైద్య సిబ్బందికి ఆరోగ్య వివరాలు తెలియజేయాలని సూచించారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్‌లో నిర్వహించిన సర్వేలో సర్పంచ్ సక్కారం అశోక్, కార్యదర్శి శ్రీనివాస్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఆర్మూర్‌లోని పలు వార్డుల్లో చేపడుతున్న సర్వేను ఎంపీడీవో గోపీబాబు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, రెండో వార్డు కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ వేర్వేరుగా పరిశీలించారు. ఏర్గట్ల, తొర్తి గ్రామాల్లో చేపడుతున్న జ్వర సర్వేను ఎంపీవో శివచరణ్ తనిఖీ చేశారు. ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామ కార్యదర్శి రాకేశ్ ఉన్నారు. నవీపేటలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేను మండల ప్రత్యేక అధికారి రమేశ్, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ పరిశీలించారు. బాల్కొండతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను ఎంపీడీవో సంతోష్‌కుమార్ తనిఖీ చేసి ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్ని మండలంలోని అంతాపూర్ తండా, పొట్టిగుట్ట తండా, శంకోరా, తగిలేపల్లి, ఆఫందిఫారం తదితర గ్రామాల్లో శనివారం ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. సర్వేను ఎంపీవో చందర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ జగ్రాం, ఉపసర్పంచ్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోటగిరి దవాఖాన డాక్టర్ సమత అన్నారు. మండల కేంద్రంలో శనివారం పలువురికి వ్యాక్సిన్ వేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి జ్వర లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందజేశారు.
62 మందికి కిట్ల పంపిణీ
ధర్పల్లి మండలంలో 38 బృందాలతో జ్వర సర్వే కొనసాగుతున్నదని ఎంపీడీవో నటరాజ్ తెలిపారు. మొత్తం 8017 ఇండ్లకుగాను రెండురోజుల్లో 5366 ఇండ్ల సర్వే పూర్తయిందని ఎంపీడీవో పేర్కొన్నారు. జ్వర లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేస్తున్నామని, ఇప్పటి వరకు 62 మందికి కిట్లు అందజేశామన్నారు.
వ్యాక్సినేషన్‌ను పరిశీలించిన ఎంపీవో
డిచ్పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి గ్రామపంచాయతీలో వ్యాక్సినేషన్ శిబిరాన్ని ఎంపీవో నాగేంద్రప్ప పరిశీలించారు. ప్రతి రోజు నడ్పల్లి గ్రామపంచాయతీలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కిషన్‌రావుకు ఆరోగ్యసిబ్బంది బూస్టర్‌డోస్ వేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.