రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సమయానికి పెట్టుబడి సాయం అందించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం శంకర్‌పల్లిలో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఏఎంసీ ఆవరణలో జరిగిన రైతు సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తున్నదన్నారు. దేశానికే అన్నపెట్టే రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నదన్నారు. ఎక్కడా లేని విధంగా పంటలకు సాగునీరు, పెట్టుబడికి ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పాలమూరు, రంగారెడ్డి పథకంతో 13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నదన్నారు
శంకర్పల్లి, జనవరి 13 : రైతు బాంధవుడు, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం శంకర్‌పల్లిలో రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఏఎంసీ ఆవరణలో జరిగిన రైతు సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్న కళ్లల్లో సంతోషం కనిపిస్తున్నదని అన్నారు. తమకు సీఎం కేసీఆర్ ఉన్నాడనే భరోసాతో రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబురాలు జరుపుకుంటుంటే కేంద్రం రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నదని ఆరోపించారు. ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ సాధించినట్లే.. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. రైతుల గురించి, వ్యవసాయం తెలియనివారు నేడు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రైతుల తరపున ధర్నా చేస్తే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. తెలంగాణ రైతులతోపాటు ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేసీఆర్ సాయం అందించడం హర్షణీయమన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన ఘనత మున ముఖ్యమంత్రిదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల ఖాతాలో వేస్తామన్న రూ.15లక్షలు ఎక్కడ అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని బీజేపీ నేతలు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాలో రియల్ బూమ్ ఉందంటే అందుకు ప్రభుత్వ పాలనే నిదర్శనమన్నారు. రంగారెడ్డి జిల్లా శివారుల్లో వెల్లువలా వస్తున్న పెట్టుబడులే అందుకు సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను గల్లీగల్లీలో కార్యకర్తలు ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీలు, కులమతాలకతీతంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. 8 విడుతలుగా రూ.50వేల కోట్ల రైతుబంధు నిధులు రాష్ట్రంలోని 63 లక్షల మంది రైతులకు ప్రభుత్వం అందించిందని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులు జలకళ సంతరించుకున్నాయన్నారు. ఈనాడు సీఎం కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం 30 ఏండ్లయినా పూర్తయ్యేది కాదన్నారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని, దాన్ని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందన్నారు. రూ.లక్ష కోట్లతో మూడు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమయ్యిందన్నారు. నేడు 43లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నదని తెలిపారు. ఇప్పటివరకు 3535కోట్లు రైతు బీమా పథకం కింద 70వేల రైతుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందించిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి పథకం దాదాపు పూర్తి కావస్తున్నదని, ఈ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే 13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. రైతు బంధు దేశానికే ఆదర్శమన్నారు. దీంతో రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. మండలంలోని ఉత్తమ రైతులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీధర్, మండల, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్‌కన్నా, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, నర్సింహులు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.