
మనోహరాబాద్, జనవరి 13 : పద్దెనిమిది నెలల క్రితం భర్త, పద్దెనిమిది రోజుల క్రితం కొడుకు, సోమవారం కూతురు ఇలా ఒకరితరువాత ఒకరు కుటుంబసభ్యులు మృత్యుఒడికి చేరడం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఇంకెవరికోసం బతకాలి.. నాకంటూ ఎవరున్నారని అనుకుందో ఏమో.. నేనూ మీతోనే వస్తానం టూ తనువుచాలించింది. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో చోటు చేసుకున్న ఈ విషాదఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మనోహరాబాద్‌కు చెందిన పోతరాజు అనిత (31)కు హైదరాబాద్‌కు చెందిన రాముతో వివాహం జరిగింది. దీంతో రాము అనిత మనోహరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి లక్ష్మి, కిశోర్ సంతానం. అయితే, రాము ఏడాడిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో అనిత కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 22న ఇంట్లో పిల్లల కోసం అనిత చికెన్ వండి పెట్టింది. అది తిన్న పిల్లలు, తల్లి వాం తులు, విరేచనాలతో అస్వస్థతకు గురవడంతో వీరిని నగరంలోని నిలోఫర్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారుడు కిశోర్ డిసెంబర్ 27న మృతి చెందాడు. అదేవిధంగా లక్ష్మీప్రియ కూడా అదే దవాఖానలో చికి త్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. కుటుంబంలోని భర్త, కుమారుడు, కూతరు ఇలా ఒకరి తరువాత మరొకరు చనిపోవడంతో అనిత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో చీరతో ఉరివేసుకొని తనువు చాలించింది. దీంతో మండల వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఆనందంగా, అన్యోన్యంగా ఉన్న కుటుంబం అనారోగ్యాల పాలై కొద్ది కాలంలోనే అందరూ మృత్యువాత పడడం బాధాకరమని స్థానికులు, బంధువులు, స్నేహితులను కంటతడిపెట్టారు.