
అందోల్, జనవరి 14 : జల్సాలకు అలవాటు పడిన కొడుకు తన తండ్రిని కడతేర్చిన ఘటన మండలంలోని మన్సాన్పల్లిలో శుక్రవారం జరుగగా, పండుగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి జోగిపేట సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన చాకలి లక్ష్మయ్య (70) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృ తుడు కుమారుడు కిష్టయ్య ఎలాంటి పనిచేయకుండా జల్సాలకు అలవాటుపడి డబ్బులకోసం తరుచూ తండ్రితో గొడవ పడుతున్నాడు. శుక్రవారం తండ్రితో డబ్బుల విషయంలో గొడవ పడి గొడ్డలితో దాడిచేశాడు. దీంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందగా, కిష్టయ్య అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.