
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 22 : బల్దియా అధికారులు ఆస్తి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి చివరి నాటికి బకాయి వసూలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ సంచాలకులు మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించడంతో సిబ్బంది వసూళ్లకు సిద్ధమయ్యారు. మున్సిపల్‌కు ప్రధాన వనరులైన ఆస్తిపన్ను వసూళ్లు పూర్తిస్థాయిలో చేపట్టాలని బల్దియా నిమగ్నమైంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో వంద శాతం రాబట్టాలని బల్దియా కసరత్తు మొదలు పెట్టింది. మొండి బకాయిదారుల వివరాల జాబితా ఇప్పటికే సిద్ధ్దం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. జాబితాను రూపొందించడంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. పన్నులు వసూలు చేయడానికి బిల్ కలెక్టర్లతో పాటు 13 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్‌కు ప్రత్యేకాధికారులను నియమించారు. పట్టణంలో 32 వార్డులు ఉం డగా నివాస గృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయలు కలిపి 10,988 ఉన్నాయి. మొత్తం పన్నులు రూ.5.40 కోట్లు, నేటి వరకు రూ.2.30 కోట్లు (30 శాతం)వసూళ్లు కాగా.. మిగతా పన్నులు వసూలు చేయాల్సి ఉన్నది. మొండి బకాయిదారుల విషయంలో యజమానులకు నోటీసులు జారీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొండి బకాయిదారులు ఆస్తి పన్ను చెల్లించాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. మార్చి 31 లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే అవకాశం
మున్సిపల్ పరిధిల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా గతేడాది నుంచి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9000253342ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో అటు మున్సిపల్ సిబ్బందికి, ఇటు ఇంటి యజమానులకు సేవలు సులభతరం కానున్నాయి. 9000253342 ద్వారా చాట్ చేసి ఆస్తి చెల్లించాల్సిన పన్ను వివరాలను తెలుసుకోవచ్చు. మున్సిపాలిటీలకు సంబంధించిన ఆస్తి పన్నుల వివరాల కోసం ఎవరైనా దీన్ని వినియోగించొచ్చు. ఈ నంబర్‌ను సెల్ ఫోన్లో సేవ్ చేసుకొని క్లిక్ చేయగానే మున్సిపల్ శాఖ స్వాగత సమాచారం అందుతుంది. తెలుగు, ఇంగ్లిషులో గానీ సమాచారం పొందే వీలు కల్పించారు.
లక్ష్యం సాధించే దిశగా..
ఆస్తి పన్ను వసూలు శత శాతం సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందిం చాం. ఇంటింటికీ వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొండి బకాయిదారుల వివరాల జాబితాను రూపొందించేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. మార్చి నెలాఖరు వరకు శత శాతం పన్నులు వసూలు చేస్తాం. ఆస్తి పన్నుదారులు అపరాధ రుసుము లేకుండా సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్