
గుమ్మడిదల, జనవరి 16 : ఎన్‌హెచ్ 765డీ రహదారిపై ఏర్పాటైన టోల్ ప్లాజా వద్ద నిత్యం వివాదాలకు కేరాఫ్‌గా మారింది. వాహనదారులకు టోల్ వసూలు చేస్తున్న క్రమం లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానికుల వాహనాలకు టోల్ ఫీజు లేకుండా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని మండల ప్రజాప్రతినిధులతో ఒప్పందం కుదిరినప్పటికీ ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వాహనదారుల నుంచి రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు టోల్ ప్లాజా నిర్వాహకులతో గొడువకు దిగుతున్నారు. ఇటీవల గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన ఓ వాహనదారుడికి ఫాస్ట్‌ట్యాగ్ నుంచి నగదు కట్ అయ్యింది. ఎందుకు వసూలు చేశారని అడుగడంతో నిర్వాహకులు వాహనదారుడిపై దాడి చేశారు. దీంతో వాహనదారుడు తనమిత్రులతో కలిసి టోల్ ప్లాజా నిర్వాహకులపై ప్రతిదాడి చేశారు. పోలీసులు, మండల నాయకులు కలిసి సమస్యను పరిష్కరించారు. తాజాగా శుక్రవారం రాత్రి నవాబ్‌పేట సర్పంచ్ అశోక్‌రెడ్డి, గొట్టిముక్కల సర్పంచ్ భర్త వాహనాకి టోల్ వసూలు చేయొద్దని వాదించడంతో ప్లాజా నిర్వాహకులు మూకుమ్మడిగా ఇద్దరిపై దాడి చేశారు. రాత్రి 12 గంటల వరకు టోల్‌ప్లాజా వద్ద గొడవ జరిగింది. పోలీసులు వచ్చి సమస్యను సద్దుమణిగించారు. గాయపడిన వారిని సమీప దవాఖానకు తరలించారు. ఇదేమిటని అడిగితే ప్లాజా నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండడంతో మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులకు ఉచిత పాసులు ఇచ్చి.. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా వసూలు
మండలంలోని 13 గ్రామాలకు చెందిన వాహనదారులకు టోల్ వసూలు చేయొద్దని మండల నాయకులు చర్చించారు. ప్లాజా నిర్వాహకులు ఒప్పందం కుదిరింది. వాహనదారుల నుంచి స్థానికత ధ్రువపత్రాలు సమర్పించి పాసులు తీసుకుంటున్నారు. దీనికి ముందు ఫాస్ట్‌ట్యాగ్ చేసుకుంటేనే ఉచిత పాసులు ఇస్తున్నారు. కాగా, ప్లాజా నిర్వాహకులకు మండల వాహనదారులు స్థానికులమని చెబుతున్నప్పటికీ ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫోన్లో మెసేజ్‌లు రావడంతో సమస్యకు దారి తీస్తున్నది. ఇదేమిటని అడిగితే ప్లాజా నిర్వాహకులు దాడులకు దిగుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి వినతిపత్రాలను ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్ సమర్పించారు. ప్లాజా నిర్వాహకులు అంగీకారం తెలిపినప్పటికీ కావాలనే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. స్థానిక ఆటో, ట్రాక్, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎంలు, లారీలకు టోల్ వసూలు చేయడంతో వివాదాలకు దారి తీస్తున్నది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి స్థానిక వాహనదారులకు ఉచితంగా రాకపోకలకు సౌకర్యం కల్పించేలా కృషి చేయాలని స్థానిక వాహనదారులు కోరుతున్నారు.