
మహబూబ్నగర్ జనవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి… రైతాంగం నడ్డివిరిచే దిశగా కేంద్రం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కేంద్రం తీరును నిరసిస్తూ ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. కేంద్రం తీరుపై ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఎరువుల ధరలను విపరీతంగా పెంచి దేశ రైతాంగం నడ్డి విరిచిందని దుయ్యబడుతున్నారు. వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడంపై అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. మొదటి నుంచి రైతు వ్యతిరేక నిర్ణయాలతో రైతులను ఆగం చేస్తున్న కేంద్రం… నల్లచట్టాలను తెచ్చి రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేయడంతో దిగొచ్చి సాక్షాత్తు ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాలను వాపస్ తీసుకున్నారు. రైతులపై కేంద్రం తప్పు చేసిందని చెప్పేందుకు ఇదొక్క ఉదాహరణ చాలు. రైతాంగాన్ని కేంద్రం ఆగం చేసేందుకు కొత్త విద్యుత్ చట్టం తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. కరెంటు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే చేయడం లేదు. దీంతో రైతులకు కనీసం కూలీలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. విపరీతంగా ఎరువుల ధరలు పెంచడం, రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా దుర్మార్గపు చర్యలకు దిగడం వెనక కేంద్రం అక్కసు అర్థమవుతున్నది. వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ పరం చేయాలని కేంద్రం పన్నుతున్న కుట్రలను భగ్నం చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. అందుకే కేంద్రం తీరును ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీవల్ల దేశానికి ఉన్న ముప్పును ప్రజలు గుర్తించాలని సూచిస్తున్నారు.
రైతుల నెత్తిన పిడుగు
కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలతో అన్నదాతపై కుట్రలు చేస్తోంది. రైతుల సంక్షేమంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఎరువుల ధరలు పెంచేందుకు సిద్ధం కావడం చూస్తే బీజేపీ సర్కారు తీరు అర్థం అవుతుంది. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం.. వారిని అప్పుల ఊబిలోకి దింపుతోంది. అంబానీ, అదానీలతో కుమ్మక్కై రైతులను వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రలకు పాల్పడుతున్నది. డీజిల్ ధరలు పెరిగిపోయి రైతులకు అన్నివిధాలా నష్టం జరుగుతుండగా.. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచితే వ్యవసాయం చేసేందుకు ఎవరూ సాహసం చేసే పరిస్థితి లేకుండాపోతుంది. రైతులను కష్టాలపాలు చేస్తున్న బీజేపీని బొంద పెట్టకుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది.