ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ తోడ్పడాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. ఓయూ టెక్నాలజీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరిని, చదువుకున్న విద్యాసంస్థలను మరిచిపోకూడదని సూచించారు. అరుదైన కోర్సులు ఈ కళాశాలలో ఉన్నాయని, వాటిలో సీట్ల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు.
నూతన విద్యావిధానానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. దానిని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేలా శిక్షణ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మన విద్యావిధానంలో ఎన్నో మార్పులు జరగాలన్నారు. అందుకు అనుగుణంగా నూతన విద్యావిధానంలో మార్పులు చేపట్టారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి చామర్తి ఉమామహేశ్వర్రావు, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ చింత సాయిలు, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ వెంకటేశ్వర్, రాజమహేందర్‌రెడ్డి, రాములు, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రొఫెసర్ కవితావాఘ్రే, ప్రొఫెసర్ రమేశ్‌కుమార్, ప్రొఫెసర్ శ్యాంసుందర్, ప్రొఫెసర్ జయప్రకాశ్, ప్రొఫెసర్ శ్రీనునాయక్, డాక్టర్ పరశురాం, కోదండరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.