
పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో వారంతా ఒక్కటయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించి తమవంతు సాయంగా ముందుకు సాగుతున్నారు. వారి సేవలను విస్తరించాలనే తపనతో మైత్రీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు..
చెన్నంశెట్టి ఉదయ్‌కుమార్, తోకల శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో మైత్రీ ఫౌండేషన్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ర్టాలకు తరలిపోతున్న వారికి అన్నదానం, ప్రయాణ ఖర్చులు, వైద్యసేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది మాస్క్‌లు అందజేశారు. ఎండ కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని అందజేయడానికి రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తనిధిని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా 765డీ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండడంతో వారికి దవాఖానలకు తరలించడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏడాదిలో 152 మంది క్షతగాత్రులకు, 21 గర్భిణులను, 32 మంది రోడ్డు ప్రమాద బాధితులను, ముగ్గురు మతిస్థిమితంలేని వారిని దవాఖానలకు తరలించి సేవలు అందించారు. కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు నెప్రోప్లస్ సంస్థ ద్వారా రూ.2.50 లక్షలతో పెయింటింగ్ వేయించారు.
మైత్రీ సేవలు మరింత విస్తరిస్తాం..
మైత్రీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవలను మరింత విస్తరిస్తాం. రెండేండ్లల్లో మండల వ్యాప్తంగా సేవలను అందించాం. భవిష్యత్‌లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకవస్తాం. మండలంలోని జడ్పీటీసీకుమార్గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణా విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజశేఖర్, తిరుమలవాసు, నాయకులు చింతల వీరేశ్ తదితరులు మా సేవలను ప్రోత్సహిస్తున్నారు. వారి అండదండలతో మరిన్ని సేవలను కొనసాగిస్తాం.