
సంస్థాన్ నారాయణపురం, జనవరి 22 : ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ ఆదర్శంగా నిలుస్తున్నది మండలంలోని అల్లందేవిచెర్వు గ్రామం. ప్రభుత్వం నుంచి నెల నెలా వస్తున్న నిధులను వినియోగిస్తూనే దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడు సర్పంచ్ సుర్వి యాదయ్యగౌడ్. దాతలు సమకూర్చిన రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం, వాటర్ ప్లాంటుతోపాటు మౌలిక వసతులను సమకూర్చారు. పల్లెప్రగతి కార్యక్రమంలో డంపింగ్ యార్డు, ప్రకృతివనం, నర్సరీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వేసి గ్రామ స్వరూపాన్ని మార్చేశారు. మద్యపానం నిషేధించి ఆదర్శ గ్రామంగా నిలిపారు.
దాతల సహకారంతో అభివృద్ధి..
అల్లందేవిచెర్వు కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు కాగా.. పాత భవనంలోనే పాలనా కార్యక్రమాలు సాగించారు. గ్రామంలో సంపూర్ణ మద్యపానం నిషేధించడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6లక్షలు అందజేశారు. వాటితో పంచాయతీ భవనం నిర్మించారు. దివీస్ సంస్థ అందించిన రూ.10లక్షలతో ఆర్వో వాటర్ ప్లాంటు ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఏర్పుల రాజేశ్, సర్పంచ్ యాదయ్యగౌడ్ లక్షా 22 వేలతో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బూడిద నందారెడ్డి ఇచ్చిన రూ.18 వేలతో చెత్త రిక్షా కొనుగోలు చేశారు. సుర్వి రవి రూ.5వేలు, నోముల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం రూ.10 వేలతో రెండు బీరువాలను పంచాయతీకి అందజేశారు. సుర్వి శేఖర్ 15వేలతో గడ్డి కటింగ్ మిషన్ ఇప్పించారు. పంచాయతీ భవనంలో ఫ్యాన్లు, ఫర్నిచర్ కోసం వెంకట్‌రెడ్డి, సైదులు, మహేందర్‌రెడ్డి, శ్రావణ్,32 వేల సహాయం చేశారు. దాతల సహకారంతో పాఠశాలకు లక్ష విలువైన బెంచీలు, విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు సమకూర్చారు.
ప్రజల సహకారం మరువలేనిది
గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు, దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాం. పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న దాతల సహకారం మరువలేనిది.