కొలువుల కుంభమేళాలో తొలి అడుగుపడుతోంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నేటి(సోమవారం) నుంచే దరఖాస్తుల ఆహ్వానం మొదలు కాబోతున్నది. యువత కల సాకారం చేసేందుకు దశాబ్దాల తర్వాత జంబో రిక్రూట్మెంట్కు శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు.. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-1కు ఈ నెల 31, పోలీసు పోస్టులకు 20వ తేదీ ఆఖరు కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉద్యోగార్థులకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నది. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుండగా, జాబ్ కొట్టేందుకు యువత తీవ్రంగా శ్రమిస్తున్నది.
– జగిత్యాల, మే 1, (నమస్తే తెలంగాణ
సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన 72వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తొలి అడుగుపడబోతున్నది. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్ ఇవ్వగా.. నేటి నుంచి గ్రూప్-1 పోస్టులు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-1 ఉద్యోగాలు, టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా పోలీసు, ఎక్సైజ్, రవాణా, జైళ్ల శాఖకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-1కు సంబంధించి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానం ద్వారా ఈ నెల 31 వరకు, టీఎస్ఎల్పీఆర్బీ ఆధ్వర్యంలోని ఉద్యోగాలకు ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఆఖరుకానున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను ఆశిస్తున్నవారున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,193 పోస్టులు జిల్లా స్థాయిలో భర్తీ కానుండగా, నిర్మల్ జిల్లా పరిధిలో 876, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 825, మంచిర్యాల జిల్లాలో 1025 పోస్టులు మొత్తంగా 3,919 పోస్టులు భర్తీ కానున్నాయి. బాసర జోన్ పరిధిలోకి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు రానుండగా.. 2,328.. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి రానుండగా.. 1,630, నాలుగు జిల్లాల పరిధిలో ఉండే మల్టీజోనల్-1లో 6,800 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టులకు, 17,291 పోలీసుతోపాటు, ఎక్సైజ్, జైలు, రవాణాశాఖ పోస్టులను భర్తీ చేసేం దుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. 503 గ్రూప్-1 పోస్టులన్నింటినీ మల్టీజోన్ పోస్టులుగా ప్రక టించిన ప్రభుత్వం, జనరల్ కేటగిరీలో 278 పోస్టులు, మహిళా రిజర్వేషన్లో 225 పోస్టులను భర్తీ చేయబోతు న్నది. స్వరాష్ట్రంలో ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో ప్రయోగాత్మకంగా ఓటీఆర్(వన్‌టైమ్ రిజిస్ట్రేషన్) పద్ధతిని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గ్రూప్-1 సర్వీసులకు అర్హత కలిగిన వారంతా ఒకేసారి దరఖాస్తు చేసుకుంటారు. తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌కు ఈ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రంలో దశాబ్దాల తర్వాత భారీ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలు కాబోతున్నది. ఖాళీగా ఉన్న 72వేల పోస్టులను దశలవారీగా తొమ్మిది నెలల వ్యవధిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పిం చింది. గ్రూప్-1తోపాటు, పోలీసు, ఎక్సైజ్, రవాణా, జైళ్ల శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలోనే గ్రూప్-2, 3, 4తోపాటు, ఇంకా అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాను న్నాయి. తెలంగాణలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంతవరకు జరగలేదనే చెప్పాలి. రాష్ట్రంలో ఏ శాఖలో ఖాళీలు లేకుండా నూతన జిల్లాలకు అనుగుణంగా, కొత్త జోన్ల ఆధారంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను సర్కారు చేపడుతున్నది.
జంబో రిక్రూట్మెంట్ నేపథ్యంలో ఉద్యోగార్థులు కొలువే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన మరుక్షణమే ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇప్పటికే పలువురు ప్రైవేట్ ఉద్యోగులు, తాము చేస్తున్న టెంపరరీ ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ చదువుతు న్నారు. ఇక ఎస్సీ, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ఇప్పటికే వందలాది మంది శిక్షణ పొందుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని చాలా పట్టణాల్లో గ్రంథాలయ సంస్థలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గ్రూప్ 1, 2,3,4 ఉద్యోగాల కోసం వేలాది మంది యువకులు హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో చేరిపోయారు. కొన్ని పట్టణాల్లో ప్రభుత్వ లెక్చరర్లు, వివిధ సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఉద్యోగార్థులకు సహకరిస్తూ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడం విశేషం.
భారీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో ఉద్యోగార్థులకు ప్రభుత్వంతోపాటు, స్వచ్ఛంద సంస్థలు, గ్రంథాల యాలు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నా యి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర సర్కారు ఉద్యోగా ర్థులకు శిక్షణ ఇవ్వడంతోపాటు, ట్రైనింగ్ పీరియడ్‌కు కొంత రెమ్యునరేషన్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నది.
షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ నడుస్తున్నది. దీంతోపాటు రాష్ట్రం లోని 31 జిల్లా కేంద్రాల్లో మూడు నెలల గడువుతో పోలీసు, గ్రూప్స్ తదితర పోస్టులకు శిక్షణ ఇస్తున్నారు. గిరిజన సంక్షే మశాఖ ఆధ్వర్యంలో మూడు నెలల కాలానికిగాను గ్రూప్-1, పోలీసు ఉద్యోగార్థులకు 45 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇందులో 30 చోట్ల రెసిడెన్షియల్, మిగిలిన 15 చోట్ల నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్స్‌తోపాటు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శిక్షణతోపాటు ఎంపిక చేసిన కొందరు ఉద్యోగార్థులకు ఆరు నెలలపాటు శిక్షణ, ఆర్థిక సాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 72 వేల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 83 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు.
ఇందులో 11 వేల పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తున్నామని, మిగిలిన 72 వేల పోస్టులను నేరుగా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిషికేషన్లు ప్రభుత్వం దశలవా రీగా విడుదల చేస్తుందని తెలియజేశారు. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనశాఖ రాష్ట్రం లోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రకటించింది.
దీంతోపాటు రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్థానికతకు పట్టం కట్టే విధంగా జోనల్ వ్యవస్థను స్థిరీకరించి, రాష్ట్రపతి అనుమతి పొందడంతో నూతన జోన్ల వారీగా, జిల్లాలవారీగా పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుబెడుతా మని ప్రకటించారు. జిల్లా, జోనల్, మల్టీజోన్ పోస్టులను వర్గీకరించి, వాటి ఆధారంగానే భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లా, జోనల్, మల్టీజోన్ స్థాయిలో 95 శాతం లోకల్కోటాగా నిర్ధారించడంతో అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం జరిగే పరిస్థితి నెలకొంది.
ఎస్సై: (సివిల్) 414
ఎస్సై: (ఏఆర్) 66
ఎస్సై: (ఎస్ఏఆర్-సీపీఎల్) పురుషులు 5
ఎస్సై: (టీఎస్ఎస్పీ) పురుషులు 23
ఎస్సై: (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పురుషులు 12
ఎస్సై: (విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ) 26 డిప్యూటీ జైలర్ (మెన్) 8
ఎస్సై: (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్) 22
ఎస్సై: (పోలీస్ ట్రాన్స్పోర్ట్) పురుషులు 3
ఏఎస్సై: (ఫింగర్ ప్రింట్ బ్యూరో) 8 మొత్తం 587
కానిస్టేబుల్: (సివిల్) 4965
కానిస్టేబుల్: (ఏఆర్) 4423
కానిస్టేబుల్: (రిజర్వ్) పురుషులు 100
కానిస్టేబుల్: (టీఎస్ఎస్పీ) పురుషులు 5010
కానిస్టేబుల్: (స్పెషల్ పోలీస్ ఫోర్స్) 390
కానిస్టేబుల్: (అగ్నిమాపక శాఖ) 610
వార్డర్: (జైళ్ల శాఖ) పురుషులు 136
వార్డర్: (జైళ్లశాఖ) మహిళలు 10
కానిస్టేబుల్: (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్) 262
కానిస్టేబుల్:(మెకానిక్) పురుషులు 21
కానిస్టేబుల్: (డ్రైవర్) పురుషులు 100
మొత్తం 16,027
గ్రూప్-1 నోటిఫికేషన్లో పేర్కొన్న వివిధ పోస్టులు, వయోపరిమితి వివరాలు
పోస్టు పేరు సంఖ్య
డిప్యూటీ కలెక్టర్ 42
డిప్యూటీ సూపరింటెండెంట్
ఆఫ్ పోలీసు (క్యాటగిరి -2) 91
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48
రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 04
జిల్లా పంచాయతీ ఆఫీసర్ 05
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 05
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్02
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ -2 41
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్
అసిస్టెంట్ డైరెక్టర్ 03
జిల్లా బీసీ సంక్షేమాధికారి 05
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 02
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 02
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెడికల్) 20
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40
ఎంపీడీవో 121
మొత్తం 503