ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తునికాకు సేకరణకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యేడాది 66 యూనిట్ల పరిధిలో 67 వేల స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లాలో 31 యూనిట్లు, 25 వేల స్టాండర్డ్ బ్యాగులు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 25 యూనిట్లు.. 33,300 స్టాండర్డ్ బ్యాగులు.. ఆదిలాబాద్ జిల్లాలో 10 యూనిట్లు, 8,700 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆయా యూనిట్ల పరిధిలో కొమ్మకొట్టడం పూర్తి చేసిన అధికారులు.. తునికాకు సేకరణ ద్వారా పేదలకు రోజూ రూ.300-రూ.400 కూలి కల్పించనున్నారు. కల్లాలను ఏర్పాటు చేసి ఆకును సేకరిస్తామని అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో 4,153 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా, 1706.89 చదరపు కిలోమీటర్ల అటవీ వి స్తీర్ణం ఉంది. జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ అటవీశాఖ డివిజన్లు ఉండగా దట్టమైన అడవులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నరికివేతకు గురైన అడవులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో పాటు అడవుల సంరక్షణకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుడడంతో జిల్లాలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. వేసవిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తునికాకు సేకరణ ద్వారా ఉపాధి పొందుతారు.
ఈ ఏడాది సైతం అటవీశాఖ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 12 యూ నిట్లను ఏర్పాటు చేయనుండగా, ఇందుకోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో 10 యూనిట్ల టెండర్లు పూర్తికాగా, ఆదిలాబాద్ (బీ), సోనాల యూనిట్లు అమ్ముడు పోలేదు. అదేవిధంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 25 యూనిట్లు ఏర్పాటు చేయనుండగా 33,300 స్టాండర్డ్ బ్యాగులు, మంచిర్యాల జిల్లాలో 31 యూనిట్లు ఏర్పాటు చేయనుండగా, 25000 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని అధికారులు నిర్దేశించారు.
ఈ వేసవిలో జిల్లాలోని 8700 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆదిలాబాద్ అటవీశాఖ డివిజన్లో 6, ఇచ్చోడ డివిజన్లో 2, ఉట్నూర్ డివిజన్లో 2 యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజన్లో 5100 స్టాండర్డ్ బ్యాగులను సేకరించనున్నారు. ఆదిలాబాద్ యూనిట్లో 800 స్టాండర్డ్ బ్యాగులు, బేల యూనిట్లో 1200, దస్నాపూర్ యూనిట్లో 700, ఇంద్రవెల్లి యూనిట్లో 800, నార్నూర్ యూనిట్లో 800, ఉట్నూర్ యూనిట్లో 800 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యంగా నిర్దేశించారు.
ఉట్నూర్ ఫారెస్ట్ డివిజన్లో దస్నాపూర్ (బీ) యూనిట్లో 2000 స్డాండర్డ్ బ్యాగులు, సిరిచెల్మ యూనిట్లో 900, ఇచ్చోడ డివిజన్లో ఇచ్చోడ యూనిట్లో 500, తర్నం యూనిట్లో 200 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యంగా ఎంచుకున్నారు. గ్రామాల్లో పేదలు రోజు ఉదయం ఆకును తీసుకువచ్చేందుకు అడవులకు పోతారు. మధ్యాహ్నం కట్టలుగా కట్టి సాయంత్రం కళ్లాలకు తీసుకుపోతారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సీజన్లో తునికాకు సేకరణ ద్వారా ఉపాధి లభిస్తుంది. రోజుకు ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది.