మంచిర్యాల, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సర్కారు భారీ ఉద్యోగాల జాతరకు సిద్ధమవుతుండడంతో, నిరుద్యోగ అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే పోలీస్, గ్రూప్ 1 ప్రకటనలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో నిరుద్యోగ యువత బిజీబిజీగా ఉంది. కొలువులు కొట్టేందుకు గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లు, ప్రత్యేక ప్రాంతాల్లో పోటీ పరీక్షలకు సీరియస్‌గా ప్రిపేరవుతున్నది. రాష్ట్ర సర్కారు కొలువుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయడం, వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడంతో యువతలో ఉత్సాహం నెలకొన్నది.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పుస్తకాల కోసం బుక్ స్టాళ్లతో పాటు ప్రశాంతంగా చదువుకునేందుకు గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నది. మరోవైపు కోచింగ్ సెంటర్లకు కూడా తాకిడి పెరుగుతున్నది. మరోవైపు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుండడం పేద ఉద్యోగార్థుల్లో ఊరట కలుగుతున్నది. భారీ నోటిఫికేషన్లకు సుముఖత చూపిన రాష్ట్ర సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యువత కృతజ్ఞతలు తెలుపుతున్నది.
నా పేరు పైకరావు సాయి కుమార్. మాది కోటపల్లి మండలంలోని బొప్పారం గ్రామం. నేను బీఎస్సీ బీజడ్సీ పూర్తి చేశా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సీరియస్‌గా ప్రిపేరవుతున్నాను. చెన్నూర్‌లోని గ్రంథాలయంలోకి రోజూ వచ్చి ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్, వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్, జనరల్ నాలెడ్జికి సంబంధించి చదువుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణలో మంచి మెటీరియల్ ఇస్తున్నారు. రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాను.
– పైకరావు సాయి కుమార్, బొప్పారం, కోటపల్లి మండలం
యువత ఎదురు చూస్తున్న ఉద్యోగాల ప్రకటన రానే వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో అతి భారీ నోటిఫికేషన్ కావడం గమనార్హం. గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. 2018లో 18 వేల పైచిలుకు పోలీసు పోస్టులు భర్తీ చేయగా, మరోమారు దాదాపు అదే స్థాయిలో 16,614 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హతలున్న అభ్యర్థులను ఆన్లైన్లో ఎంపిక చేసి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు 503 గ్రూపు 1 నోటిఫికేషన్‌కు నగారా మోగించడంతోనూ ఉద్యోగార్థుల్లో సందడి నెలకొంది. టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి గ్రూపు-1 నోటిఫికేషన్ కావడం గమనార్హం. మరోవైపు వయోపరిమితి పెంపుతో అభ్యర్థులు అధిక సంఖ్యలో పెరగనున్నారు.
గరిష్ట వయో పరిమితిని ప్రభుత్వం మూడేండ్లు పెంచింది. ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గతంలో గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు ఉండగా, ఇప్పుడు 28 ఏండ్ల వరకు కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. జనరల్ కేటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 22 ఏండ్ల నుంచి 25 ఏండ్ల వరకు పెంచింది. ఇక రిజర్వేషన్లు వర్తించే (ఎస్సీ, ఎస్టీ, బీసీ) వారికి మరింత అదనపు వయోపరిమితి వర్తిస్తుంది.
నా పేరు నగేశ్. మాది మంచిర్యాల. నేను ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. రెగ్యులర్‌గా మంచిర్యాలలోని లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నాను. కోచింగ్‌కు సన్నాహాలు చేయడం, అవసరమైన నోట్ బుక్స్, ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలు అందిస్తామని ప్రకటించడంతో మాలాంటి వారికి ఎంతో లాభం చేకూరుతుంది.
నా పేరు కోడి రమేశ్. మాది చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ. నేను ఎంబీఏ పూర్తి చేశాను. 2014లోనూ గ్రూప్స్ రాశాను. ప్రస్తుతం గ్రూపు-2 కోసం ప్రిపేరవుతున్నాను. రోజూ చెన్నూర్‌లోని లైబ్రరీలోకి వచ్చి అవసరమైన పుస్తకాలు, పత్రికలను చదువుతున్నాను. తోటి మిత్రులతో విషయానికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాను. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడంతో సులువుగా చదువుకోగలుగుతున్నా. త్వరలో ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తామని చెప్పారు. అందుకోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రస్తుతం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ సీరియస్‌గా చదువుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాలాంటి యువతకు మంచి అవకాశం కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– కోడి రమేశ్, ఎంబీఏ, శ్రీనగర్ కాలనీ, చెన్నూర్