తానూర్, ఏప్రిల్ 11 : రానున్న హరితహారం నాటికి అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని మహాలింగి, బామ్ని, బొంద్రట్ గ్రామాలను సోమవారం ఆయన సందర్శించారు. మహాలింగి గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనం, నర్సరీని బామ్ని గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం, పారిశుధ్య పనులు, బొంద్రట్ గ్రామంలో నర్సరీ, పల్లెప్రకృతి వనం, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలను ఏపుగా పెంచాలన్నారు.
వర్షాకాలం ప్రారంభంకాగానే హరితహారం కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది ప్రతి రోజూ నర్సరీలను పరిశీలించాలని ఆదేశించారు. వేసవి సందర్భంగా ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డీఎల్పీవో శివకృష్ణ, తహసీల్దార్ వెంకటరమణ, మండలాభివృద్ధి అధికారి గోపాలకృష్ణారెడ్డి, ఎంపీవో మోహన్‌సింగ్, ఏపీవో గంగాధర్, మాజీ ఎంపీపీ బాషెట్టి రాజన్న, పోశెట్టి, గోదల కేశవ్, పంచాయతీ కార్యదర్శులు జయశ్రీ, భరత్ తదితరులు ఉన్నారు.
వేసవికాలంలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు కోలూర్, నంద్‌గావ్, దౌలతబాద్, ఖర్బలా, జౌళ(బీ) గ్రామాల్లో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సందర్శించారు. పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, పారిశుధ్య పనులను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆయన వెంట ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు.