ఎదులాపురం, ఏప్రిల్ 20 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రభుత్వం నిర్దేశించిన మైక్రాన్ కవర్లను వినియోగించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన 120 మైక్రాన్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలని, దవాఖానల నుంచి వెలువడుతున్న బయో మెడికల్ వేస్టేజ్‌ను సంబంధిత ఏజెన్సీల ద్వారా తరలించాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించామని, తడి, పొడి చెత్త సేకరణతో పాటు ప్లాస్టిక్ కవర్లను విడిగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్లలో నిలువ చేయాలని సూచించారు.
జూలై నుంచి 75 మైక్రాన్ కలిగిన కవర్లను, డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ లోపు కలిగిన కవర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఐటీడీఏ పీవో అంకిత్, డీఎఫ్‌వో రాజశేఖర్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీఏ కిషన్, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ ఈఈ వెంకటశేషయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా, విద్యుత్ సౌకర్యం కల్పనకు అవసరమైన అటవీ అనుమతులు నిబంధనల మేరకు జిల్లా స్థాయి కమిటీ మంజూరు చేస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు రవాణా, విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ప్రతిపాదించిన అటవీ శాఖ అనుమతులు జిల్లా స్థాయి కమిటీలో చర్చించి నిబంధనల మేరకు మంజూరు చేస్తారన్నారు.
పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ, రోడ్లు భవనాల శాఖల ద్వారా చేపట్టే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధిత శాఖల ప్రతిపాదనలు పరిశీలించి జిల్లా స్థాయి కమిటీలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.