ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి లక్ష్మీపూర్‌లో గానుగ నూనె తయారీ కేంద్రం ప్రారంభం
సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనుల పరిశీలన
జగిత్యాల రూరల్, మే 29: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం లక్ష్మీపూర్‌లో మల్లికార్జున మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టె గానుగ నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు ప్రభుత్వ రుణాలతో ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రతి మహిళ గ్రామైక్య సంఘాల పరిధిలో కనీసం 5 నుంచి అంతకన్నా ఎక్కువ యూనిట్లు పెట్టేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. తద్వారా స్థానికంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, ఆర్థికంగా మహిళలు నిలబడేలా చేయడం జరుగుతుందని చెప్పా రు. అనంతరం జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ మహిళా సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, సహజ బ్రాండ్ ద్వారా ఉత్పత్తులు చేస్తూ జగిత్యాల జిల్లాకే మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు రాజేందర్, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సభ్యులు నలువాల సునిత, మంగళారపు మహేశ్, ఎంపీడీవో రాజేశ్వరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల ముకుందం, నాయకులు ఆరె తిరుపతి, నల్ల స్వామిరెడ్డి, లక్క రాజిరెడ్డి, చిన్న గంగయ్య, ఎ రాజారెడ్డి, సంఘ సభ్యులు సత్తవ్వ, లత, మమత, శ్రీలత, ఎపీఎం వి గంగాధర్, శ్రీనిధి మేనేజర్లు మారుతి, రాజశేఖర్, సీసీ మరియా, వీవోఏ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.