శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో 53141, వికారాబాద్లో 12908 కుటుంబాల సర్వే
జ్వర లక్షణాలున్నవారికి ఐసొలేషన్ కిట్ల అందజేత
షాబాద్, జనవరి 28 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటికీ ఆరోగ్య సర్వే జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. శుక్రవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53,141 ఇండ్లలో వైద్య సిబ్బంది ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టినట్లు సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 1108 మందికి జ్వర లక్షణాలు కనిపించగా, వారికి ఐసొలేషన్ కిట్లు అందజేశారు. 678 వైద్య బృందాలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు జిల్లాలో 3,90,786 ఇండ్లలో సర్వే చేపట్టగా, 10,512మందికి జ్వర లక్షణాలున్నట్లు గుర్తించారు. కొవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. 15-18 ఏండ్ల లోపు చిన్నారులు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.
జిల్లాలో 217014 కుటుంబాల సర్వే పూర్తి
పరిగి, జనవరి 28 : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే తుది దశకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో ఎనిమిదో రోజు 353 ప్రత్యేక బృందాలు 12,908 కుటుంబాల జ్వర సర్వే చేపట్టారు. జిల్లా పరిధిలో 2,20,386 కుటుంబాలుండగా ఇప్పటివరకు 2,17,014 కుటుంబాల సర్వేను పూర్తిచేశారు. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహా, మిగతా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి జ్వర సర్వే పూర్తయింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ప్రత్యేక బృందాలు జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు లక్షణాలున్నవారికి మందులు పంపిణీ చేశారు. జిల్లా పరిధిలో శుక్రవారం 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 382 మందికి మొదటి డోసు, 18 ఏండ్లు పైబడినవారిలో 741 మందికి మొదటి డోసు, 2046 మందికి రెండో డోసు, 60 ఏండ్లు పైబడినవారిలో 79 మందికి ప్రికాషనరీ డోసు కొవిడ్ టీకా వేశారు.