రెండేళ్లుగా వెలిచాల నృసింహుడి సన్నిధిలో వేడుకలు
పురాతన ఆలయానికి పూర్వవైభవం
భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఆలయం
రామడుగు, జూన్ 27:చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన వెలిచాల నృసింహుడి ఆలయం నిత్యకల్యాణంతో కొత్త శోభను సంతరించుకున్నది. రెండేండ్లుగా నిత్య కైంకర్యాలతో అలరారుతున్నది. ఇన్నాళ్లు ధూపదీప నైవేద్యాలకు దూరమైన సన్నిధానం నేడు భక్తుల కొంగుబంగారంగా భాసిల్లుతున్నది..
రామడుగు మండలం వెలిచాలకు దక్షిణాన, ఊర చెరువు సమీపంలో సుమారు 600 ఏండ్ల క్రితం రాతి కట్టడం శిఖరంపై లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, గడిని నిర్మించారు. కాలక్రమంలో గుడి శిథిలావస్థకు చేరి దూపదీప నైవేద్యాలకు దూరమైంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన భక్తుడు వీర్ల ప్రభాకర్‌రావు ఆలయాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. 13 ఏండ్ల కిందట త్రిదండి చిన జీయర్‌స్వామిని కలిసి ఆలయ ప్రాశస్థ్యాన్ని వివరించారు. ఈ క్రమంలో జీయర్‌స్వామి ఆలయాన్ని సందర్శించి చేసిన సూచనలకు అనుగుణంగా ఆలయాన్ని పునరుద్ధరించారు. కనుమరుగైన కొనేరును సైతం పునర్నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు బ్రహ్మోత్సవాలు..
జీయర్‌స్వామి మంగళ శాసనాలతో పన్నెండేండ్లుగా పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వంశ పారంపర్యంగా సౌమిత్రి నరసింహాచార్యులు, ఆయన కుమారుడు రంగాచార్యులు, మనుమడు రామానుజాచార్యులు ఆలయ అర్చకులుగా కొనసాగుతున్నారు. ఇక్కడి ఆలయానికి మరో ప్రత్యేకత ఉన్నది. మూలవిరాట్టుగా వెలసిన లక్ష్మీనృసింహస్వామి భక్తుల పూజలు అందుకొంటుండగా బ్రహ్మోత్సవాలు, నిత్య కల్యాణం సందర్భంగా ఉత్సవ మూర్తులు రుక్మిణి, సత్యభామ సహిత వేణుగోపాలస్వామి ఆసీనులై ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు సహస్ర దీపాలంకరణ, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారా దర్శనం కల్పిస్తారు. శ్రీరామనవమి నాడు స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ధనుర్మాసంలో పద్మావతి, అలివేలుమంగ సహిత వేంకటేశుడి లగ్నాన్ని జరిపిస్తున్నారు. అలాగే శిథిలావస్థకు చేరిన గడి స్థలాన్ని రూ. 20లక్షలు వెచ్చించి తీరొక్క మొక్కలతో నందనవనంలా తీర్చిదిద్దారు.
జీయర్‌స్వామి సూచనలతో..
చిన జీయర్ స్వామి వారి సూచనల మేరకు ప్రసిద్ధి చెందిన నృసింహుడి ఆలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చాం. కొన్నేళ్లుగా ఆయన సమక్షంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం. గ్రామస్తులు, భక్తుల సహకారంతో నిత్య కల్యాణం జరిపిస్తున్నాం. శిథిలావస్థకు చేరిన గుడికి పూర్వవైభవం తీసుకురావడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న.
-వీర్ల ప్రభాకర్‌రావు, ఆలయ కమిటీ చైర్మన్, వెలిచాల