త్వరలో గడపగడపకూ పూర్తి స్థాయిలో శుద్ధ జలాలు
ఇప్పటికే కొన్ని వార్డులకు నీటి సరఫరా
హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 26: ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఇంటింటికీ స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం మిషన్‌భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి పాలనలో షాద్‌నగర్ మున్సిపాలిటీ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చుక్క నీటి కోసం నానా తంటాలు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక షాద్‌నగర్ పట్టణంలో నీటి కష్టాలు తీర్చే విధంగా ప్రజాప్రతినిధు లు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక ఆడబిడ్డ నీటి కోసం ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మిషన్‌భగీరథ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
గడపగడపకూ శుద్ధ జలాలు
ఇంటింటికీ శుద్ధ జలాలను అందించడమే లక్ష్యంగా సర్కార్ శ్రీకారం చుట్టిన మిషన్‌భగీరథ పనులు షాద్‌నగర్ పట్టణంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే పలు వార్డుల్లోని కాలనీల్లో మిషన్ భగరీథ నీళ్లు అందుతున్నా యి. మిగతా వార్డులకు శుద్ధ జలాలను త్వరితంగా అందిం చే లక్ష్యంతో మిషన్ భగీరథ పైపులైన్ పనులు సంబంధిత అధికారులు చకచక కొనసాగిస్తున్నారు. పైపులైన్ పనులతో పాటు మున్సిపల్ ప్రజలందరికీ సరిపడా నీళ్లను అందించే విధంగా పట్టణంలో 7 ట్యాంకుల నిర్మాణ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి.
నీటి కష్టాలు తీరాయి.
గతంలో చుక్క నీటి కోసం ఇబ్బంది ఎదుర్కొన్నాం. బిందె నీటి కోసం ఇబ్బంది పడేవాళ్లం. పనులను వదులుకొని నీటి కోసం వేచి ఉండేవాళ్లం. నేడు ఆ కష్టాలు తీరాయి. మా కాలనీలో శుద్ధి చేసిన నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది.
-అనురాధ ఆశకాలనీ షాద్‌నగర్