
దేవుడి పెండ్లికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
హాజరైన మంత్రులు తలసాని, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కనుల పండువగా కొమురెల్లి మల్లన్న వివాహ మహోత్సవం
సిద్దిపేట ప్రతినిధి, డిసెంబర్ 26,(నమస్తే తెలంగాణ)/చేర్యాల;కోరమీసాల స్వామి కొమురెల్లి మల్లన్న కల్యాణం ఆదివారం మేడలదేవి, గొల్ల కేతాదేవితో అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రాంతం దీనికి వేదికైంది. ముత్యాల పందిరిలో సంప్రదాయబద్ధంగా కల్యాణోత్సవం నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన వీరశైవ గురువు గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు, పురోహితులు, వేదపండితులు, వేద విద్యార్థులతో కల్యాణం జరిపించారు. ఆచారం ప్రకారం మల్లన్న స్వామి తరపున పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు,అమ్మవార్ల తరపున మహాదేవుని మల్లికార్జున్ దంపతులు పాల్గొని కల్యాణం చేయించారు. ఉదయం సరిగ్గా 10.45 గంటలకు కల్యాణం జరిగింది. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరపున మహాదేవుని మనోహర్ దంపతులు, మల్లన్న స్వామి తరపున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్‌రావు పట్టువస్ర్తాలు సమర్పించారు. భారీగా భక్తులు తరలిరాగా.. వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. అన్నదానం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. స్వామి పల్లకి సేవలో కేరళ వాయిద్య బృందం కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నది. రాత్రి రథోత్సవం నిర్వహించారు. విద్యుత్ వెలుగుల్లో ఆలయ పరిసరాలు వెలిగిపోయాయి.
ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచి..మామిడి తోరణాలు.. మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో కొమురెల్లి మల్లన్న స్వామి కల్యాణం ఆదివారం కడు వైభవంగా జరిగింది. కొమురెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ
ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదికలోని ముత్యాల పందిరిలో వివాహం జరిగింది. వీరశైవుల ఆడబిడ్డ మేడలదేవి,యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతాదేవిని కోరమీసాల స్వామి కొమురెల్లి మల్లన్న మనువాడారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన బార్సి మహాపీఠశాఖ వీరశైవ గురువు గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించారు. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం మార్గశిర మాసం సప్తమి ఉదయం సరిగ్గా 10.45 గంటలకు కల్యాణం జరిగింది. రాత్రి అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
కల్యాణోత్సవంలో ముఖ్య ఘట్టాలు
ఉదయం 5గంటలకు స్వామివారికి దృష్టికుంభం
ఉదయం 7గంటలకుప్రత్యేక పూజలు
ఉదయం 9.30 గంటలకు మల్లన్నస్వామి, అమ్మవార్ల పల్లకీ ఊరేగింపు
ఉదయం10.45 గంటలకు ప్రారంభమైన మల్లన్న కల్యాణం
ఉదయం11.13 గంటలకు పాణిగ్రహణం, జీలకర్ర బెల్లం కార్యక్రమం
మధ్యాహ్నం 12.18 గంటలకు వరుడు మల్లికార్జున స్వామి, వధువులు బలిజ మేడాలదేవి, గొల్ల కేతమ్మలకు మాంగళ్యధారణ
12.20 గంటలకుముగిసిన కల్యాణోత్సవం
12.30 గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం
సాయంత్రం 4గంటలకు ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
రాత్రి 7గంటలకురథోత్సవం