డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పిలుపు
మావోయిస్టు నాయకురాలు సలాకుల సరోజ కుటుంబ సభ్యులకు పరామర్శ
నిత్యావసరాలు, దుస్తులు అందజేత
బెల్లంపల్లి రూరల్, జూన్ 26: మావోయిస్టులు అడవుల్లో ఉండి ఏమి సాధించలేరని, జనజీవన స్రవంతిలో కలువాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణంలోని నర్స్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న మావోయిస్టు నాయకురాలు సలాకుల సరోజ సోదరులు రామస్వామి, మల్లయ్య కుటుంబసభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణానికి చెందిన సలాకుల సరోజ 15 ఏళ్లలోనే అప్పటి నక్సల్స్‌లో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిందన్నారు. 37 ఏళ్లుగా ఇతర రాష్ర్టాలో నాయకురాలిగా పని చేస్తుందన్నారు. ఇటీవల కరోనాతో బాధపడుతున్న ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలకు సరైన వైద్యం చేయించుకోలేని స్థితిలో మృతి చెందారని గుర్తు చేశారు. సరోజ లొంగిపోతే ఆమె కేసులు ఎత్తివేసి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని, ఆమెకు వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందించి అండగా నిలబడతామన్నారు. ఆమె స్వచ్ఛందంగా, నిర్భయంగా మంచిర్యాల జిల్లాలోని ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా లొంగిపోవచ్చని సూచించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, బెల్లంపల్లి వన్‌టౌన్, బెల్లంపల్లిరూరల్ సీఐలు ముస్కె రాజు, కే జగదీశ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
సరోజ లోంగిపో:సోదరుల వేడుకోలు
‘అమ్మా సరోజ, నిన్ను చూడాలని ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి లొంగిపోయి మాతో పాటే హాయిగా జీవించు’ ఆమె సోదరులు రామస్వామి, మల్లయ్య కోరారు. తెలంగాణ ప్రభుత్వం హ యాంలో మావోయిస్టులకు లొంగిపోయి సంతోషంగా బతుకుతున్నారు. నీవు కూడా జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.