ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కావద్దనే సర్కారు నిర్ణయం
స్కూళ్లు అందుబాటులో లేని విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ భత్యం
ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు పిల్లలకు నెల నెలా సాయం
ఈ యేడాది నుంచి కొత్తగా 9.10వ తరగతి విద్యార్థులకు..
ఇటీవలే ఉమ్మడి జిల్లాకు 1.83 కోట్లు మంజూరు
3,050 మందికి ప్రయోజనం
జగిత్యాల, మే 26 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, విద్యార్థులకు ఏ లోటూ రాకుండా చూస్తున్నది. ఉచిత భోజనం, యూనిఫాం, ఉపకార వేతనాలు తదితర సౌకర్యాలే కాదు స్కూళ్లు అందుబాటులో లేని విద్యార్థులకు రవాణా భత్యాన్నీ మంజూరు చేస్తున్నది. ఇటీవలే ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు రవాణా భత్యం కింద 1.83 కోట్లు మంజూరు చేసింది. ఈ యేడాది అదనంగా 9, 10వ తరగతి పిల్లలకు అవకాశం కల్పించగా, మొత్తం 3,050 మందికి ప్రయోజనం కలుగనున్నది.
విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు ప్రతి విద్యార్థికీ పాఠశాల చేరువగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ దూరంలో, ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్ల దూరంలో, ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల దూరం (మినిమం)లో ఉండాలనే నిబంధన ఉంది. ఒకవేళ లేకపోతే ఆయా విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం చెల్లించాలని చట్టం చెబుతుండగా, ఈ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 8వ తరగతి వరకు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల్లో ఎవరైతే ఆవాస పరిధిలో పాఠశాల లేకుండా ఉండి, దూరంగా ఉన్న పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారో వారికి రవాణా భత్యం చెల్లిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి లోపున్న విద్యార్థులకు నెలకు 400 చొప్పున పది నెలలకు మొత్తం 4వేలు, ఐదు నుంచి 8వ తరగతి చదివే వారికి నెలకు 600 చొప్పున పది నెలలకు 6వేలు అందజేస్తూ వస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,050 మందికి భత్యం..
రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే ఉమ్మడి కరీంనగర్లో ఆవాసాల పరిధిలో పాఠశాలల సంఖ్య అధికంగానే ఉంది. ప్రస్తుతం నాలుగు జిల్లాల పరిధిలో నాలుగు వేలకు పైగా పాఠశాలలు ఉండగా, కేవలం 298 పాఠశాలలను మాత్రమే హ్యాబిటేషన్కు దూరంగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ స్కూళ్లలో మొత్తం 3,050 మంది భత్యానికి అర్హత కలిగి ఉన్నారని గుర్తించి, వారికి 2020-2021 విద్యా సంవత్సరానికి 1.83 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో హ్యాబిటేషన్లకు దూరంగా 14 ప్రైమరీ స్కూళ్లు ఉండగా, 187 మంది కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించి అభ్యసిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 19 ఉండగా, 176 మంది దూరం నుంచి వచ్చి అభ్యసిస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లాలో 17 ప్రైమరీ స్కూళ్లలో 203 మంది విద్యార్థులు, 25 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 259 మంది విద్యార్థులున్నారు. పెద్దపల్లి జిల్లాలో 29 ప్రాథమిక పాఠశాలల్లో 413 మంది, 39 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 355 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 ప్రాథమిక పాఠశాలల్లో 80 మంది, 37 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 286 మంది విద్యార్థులు దూరం నుంచి వచ్చి అభ్యసిస్తున్నారు. మొత్తంగా 183 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,939 మంది రవాణా భత్యానికి అర్హులుగా నిర్ణయించారు.
కొత్తగా 9,10 తరగతి పిల్లలకూ సాయం
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం గత విద్యా సంవత్సరం వరకు కేవలం 8వ తరగతి వరకు మాత్రమే రవా ణా భత్యాన్ని ఇస్తూ వచ్చారు. అయితే ఈ యేడు నుంచి 9,10వ తరగతి పిల్లలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి వరకు ప్రతి విద్యార్థికి చదువును చెప్పించడం బాధ్యతగా తీసుకోవాలన్న ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో 115 ఉన్నత పాఠశాలల్లో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 1,111 మంది ఉండగా, వారికి 2020-2021 విద్యా సంవత్సరానికి రవాణా భత్యాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. జగిత్యాల జిల్లాలో 19 పాఠశాలల పరిధిలో 519 మంది విద్యార్థులే. కరీంనగర్ జిల్లాలో 23 పాఠశాలల పరిధిలో 184 మంది, పెద్దపల్లిలో 40 పాఠశాలల్లో 501 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33 పాఠశాలల్లో 250 మంది భత్యానికి అర్హులుగా నిలిచారు. అయితే రవాణా భత్యాన్ని విద్యార్థులకు ఎంత చొప్పున ఇస్తున్నట్లుగా ప్రకటించలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిశీలించి చూస్తే, రవాణా భత్యాన్ని సైతం పెంచినట్లుగా కనిపిస్తున్నది. గతంలో ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 10 నెలలకు 4వేలు, 8వ తరగతి వరకు 6వేలు ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ సారి అందరు విద్యార్థులకు (శిశు నుంచి 10వ తరగతి వరకు) నెలకు 600 చొప్పున పది నెలలకు 6వేలు సగటున ఇచ్చినట్లుగా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.