
నేటి నుంచి 29వతేదీ వరకు దుద్దెడ శంభుదేవుడి జాతర
వార్షిక బ్రహోత్సవాలకు ముస్తాబైన దేవాలయం
మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలు
శివపార్వతుల కల్యాణానికి హాజరు కానున్న ప్రముఖులు
కొండపాక, జనవరి 26 : భక్తుల కోరిన కోరికలు తీర్చే దుద్దెడ స్వయంభూ శంభుదేవాలయ వార్షిక బ్రహోత్సవాలు గురువారం నుంచి 29వతేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ గొల్లపల్లి రామచంద్రమూర్తిశర్మ తెలిపారు. ఏటా ఈ ఉత్సవాలు పుష్యమాసం బహుళ దశమి మొదలుకొని ద్వాదశి వరకు మూడు రోజులు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. శివపార్వతుల కల్యాణం కోసం ప్రత్యేక పందిళ్లు వేశారు. శివపార్వతుల కల్యాణానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి ట్రస్టు సభ్యులు తెలిపారు. వార్షిక బ్రహోత్సవాల్లో గురువారం ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యహవచనం, అంకురార్పణ, మూలవిరాట్ అభిషేకం, సాయంత్రం శకటోత్సవం (దేవాలయం చుట్టూ బండ్లు తిరగడం) అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తారు. శుక్రవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, అమ్మవారికి అభిషేకం, నవగ్రహ హోమం, రుద్ర పాశుపత హోమం, సుదర్శన హోమం, చండీహోమం, పూర్ణాహుతి పూజాలు నిర్వహిస్తారు. అలాగే అదే రోజు రాత్రి దిష్టికుంభాలు, రథం ఆలయ ప్రదక్షిణం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శనివారం ఉదయం స్వామి వారి ఎదుర్కోలు, అనంతరం మూలనక్షత్ర యుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ శుభ మూహుర్తాన వైభవంగా శివపార్వతుల కల్యాణం అనంతరం అన్నదానం, రాత్రి స్వామివారి రథోత్సవం, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ తెలిపారు.
దేవాలయ చరిత్ర
శైవ దేవాలయాలకు తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. కాకతీయుల కాలంలో చక్కటి శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన ఎన్నో దేవాలయాల్లో కొండపాక మండలం దుద్దెడలోని స్వయంభూ దేవాలయం ఒకటని చెప్పవచ్చు. 10వ శతాబ్దానికి పూర్వం స్వయంభూగా వెలిసిన స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయం అనేక విశిష్టతలకు నిలయం. భక్తుల పాలిట కల్పవృక్షమై కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమై భక్తజనావళి నీరాజనాలు అందుకుంటూ మహిమాన్విత క్షేత్రంగా పేరుపొందింది. ప్రధాన దేవుడు జలలింగముగా, అమ్మవారు శివశక్తి స్వరూ పిణిగా వెలిసి విరాజిల్లుతున్నది. ఈ దేవాలయాన్ని పానిగంటి రాజైన మాధవరెడ్డి నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దేవాలయ ఆవరణలో గల శిలాశాసనం ఆలయ చరిత్రను తెలుపుతున్నది. ఈ ప్రాచీన ఆలయం కోసం నిర్మించిన రెండంతస్తుల ప్రాకారాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నది. ఆలయ ప్రధాన ద్వారానికి ముందు స్వామి సేవకు అవసరమగు నీటి కోసం కోనేరు నిర్మించారు. కోనేరులో ఉన్న సొరంగమార్గాలు ఉత్తర ద్వారం కాశీకి వెళ్లే మార్గమని, రెండో ద్వారం వేములవాడకు, దక్షిణ ద్వారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వద్దకు వెళ్లే సొరంగ మార్గమని, దక్షిణ నైరుతి మార్గం రాముడి గుట్టకు వెళ్లే మార్గమని, పశ్చిమ ద్వారం ప్రధాన దేవాలయానికి, ఉత్తర ఈశాన్య సొరంగం అప్పలాయ ఆంజనేయస్వామి ఆలయానికి మార్గాలుగా ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు.
దేవాలయ అభివృద్ధిలో…
స్వయంభూ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామానికి చెందిన గొల్లపల్లి రామచంద్రమూర్తి తన శిష్యబృందం, గ్రామస్తులు, ఇతర పెద్దలతో కలిసి దేవాలయ అభివృద్ధి కోసం అడుగులు వేశారు. దాతలు, గ్రామస్తుల సహకారంతో దేవాలయం అభివృద్ధి చెందింది. దేవాలయంలో వైదిక మండపంతో పాటు దుకాణా సముదాయం నిర్మించారు. ప్రతి సంవత్సరం స్వయంభూ శంభు లింగేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తారు.