
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్/లింగాల, జనవరి 26 : 12 మెట్ల కిన్నెర వాయిధ్యకారుడు దర్శ నం మొగులయ్యకు అత్యున్నత పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని విప్ గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన మొగులయ్యతో విప్ గువ్వల జాతీయ జెండాను ఎగురవేయించారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ నల్లమలవాసి, లింగాల మం డలం అవుసలికుంట గ్రామానికి చెందిన కిన్నెర మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తమ ప్రాంతవాసికి రాగా.. తమకే వచ్చినంత సంతోషంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ కళలు, కవులు, కళాకారులకు పెద్దపీట వేశారన్నారు. తెలంగాణలో సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, అనాది నుంచి వస్తున్న కళలకు గుర్తింపు వచ్చిందన్నారు. మొగులయ్యకు చేయూత అందించామని, దీంతో తమ ప్రాంతానికి సరైన గుర్తింపు వచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్ వల్లే ఈ స్థాయికి.. : మొగులయ్య
తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సీఎం కేసీఆర్ కృషి వల్లే దక్కిందని కిన్నెర మొగులయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.10 వేలు కళాకారుల పింఛన్ మంజూరు చేసి తనకు చేయూతనందించిందని చెప్పారు. ఇప్పుడు పురస్కారం లభించడం సంతోషంగా ఉన్నదన్నారు.
కిన్నెర మొగులయ్యకు సన్మానం..
లింగాల మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మొగులయ్యను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సన్మానించారు. పల్లెపాటకు పురస్కారం రావడం గర్వకారణమని ఆయనన్నారు.