ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు
24 గంటల విద్యుత్ సరఫరా
రూ. 2.5 లక్షలతో డంపింగ్ యార్డు ఏర్పాటు
సీసీ రోడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం
మారిన నారెగూడెం రూపు రేఖలు
నవాబుపేట, డిసెంబర్ 25: నవాబుపేట మండల కేంద్రంలో 32 గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నారెగూడం. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో ఇది ఒకటి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా నారెగూడెం రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలో సీసీ రోడ్లు వెలిశాయి. గ్రా మం లో ప్రభుత్వ సాయాన్ని పొందని కుటుంబమంటూ ఏదిలేదు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షను ఉంది. గ్రామంలో అర్హులైనా వృద్ధులు ఆసరా పింఛన్ ప్రతి నెలా తీసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. నర్సరీలో మొక్కల సంరక్షణను గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారు. పల్లెప్రకృతి వనంలో ప్రస్తుతం రెండు వేల మొక్కలు ఉన్నాయి. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడానికి తడి, పొడి చెత్త డబ్బాలను ఉచితంగా అందజేశారు. గ్రామానికి ప్రభుత్వం ఉచితంగా రూ.9 లక్షల విలువైన ట్రాక్టర్ను అందజేసింది. గ్రామంలో రూ. 2.5 లక్షలతో డంపింగ్ యార్డు ను నిర్మించారు. వైకుంఠధామం నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. బృహత్ పల్లెప్రకృతి వనంలో దాదాపుగా 2025 వేల మొక్కలు ఉన్నాయి.ప్రతి వార్డుకు వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో గ్రామం మొత్తం జిగేలుమంటుంది. గ్రామంలో 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, నీటి సంరక్షణకు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకున్నారు. రైతులు తమకు సంబంధించిన సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకునేందుకు రైతు వేదిక క్లస్టర్ కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రభుత్వ సహకారం బాగుంది
గ్రామాభివృద్ధికి సర్కారు సాయం బాగుంది. అభివృద్ధి పనులకు నిధుల లోటు లేదు. పనులు జరుగుతున్నాయి. ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామస్తులు బాగా సహకరిస్తారు. రూ. 2.5 లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించాం. వైకుంఠధామం నిర్మాణపు పనులు జరుగుతున్నాయి.
ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదితాం. ప్రభుత్వం కేటాయించిన నిధులతో పలు అభివృద్ధి పనుల తోపాటు మౌలికవసతులు కల్పించాం. పారిశుధ్య సిబ్బంది ప్రతి రోజూ గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో అంటు వ్యాధులు రాకుండా ఉన్నాయి.