క్రిస్మస్ కానుకలతో నిరుపేద క్రైస్తవ కుటుంబాల్లో సంతోషం
ఎమ్మెల్యే కాలె యాదయ్య
షాబాద్, డిసెంబర్ 24 : అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని మద్దూర్ రాక్ చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కులమతాలకు అతీతంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సర్వమత సమానత్వం పాటిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ కానుకలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు అందిస్తున్నదని తెలిపారు. క్రిస్మస్ కానుకలతో నిరుపేద క్రైస్తవ కుటుంబాల్లో సంతోషం కనిపిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గూడూర్ నర్సింగ్‌రావు, సర్పంచ్ నరేందర్‌రెడ్డి, ఫాదర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
దైవచింతనతో మానసిక ప్రశాంతత
చేవెళ్ల రూరల్, డిసెంబర్ 24 : దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలో ఆంజనేయ, శివ నందీశ్వర, నవగ్రహ, ధ్వజ సహిత గ్రామ శిల ప్రతిష్ఠామహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వేదపారాయణం, మంటపారాధనలు, అంగహోమాలు, గర్త సంస్కారం, యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపనం, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లొళ్ల కార్తీక్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం సింగప్పగూడ సర్పంచ్ రహిమ బేగం, జిల్లా మైనార్టీ నాయకుడు అలీ, ఆలయ కమిటీ సభ్యులు నరేందర్‌రెడ్డిలు ఎమ్మెల్యే కాలె యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లొళ్ల కార్తీక్‌రెడ్డిలను సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవీందర్, రామన్నగూడ సర్పంచ్ శంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప మహా పడిపూజ
మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు, రావులపల్లి గ్రామ సర్పంచ్ కేసారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు, మల్కాపూర్ సర్పంచ్ శేరి శివారెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి, దేవర సమత వెంకట్‌రెడ్డి, అయ్యప్ప మాలధారులు, ప్రజలు పాల్గొన్నారు.