షాద్‌నగర్‌టౌన్, డిసెంబర్ 24 : వినియోగదారులు మార్కెట్లో రసీదు లేకుండా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయవద్దని షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఉపయోగించే వస్తువుల్లో కల్తీ, తూకంలో మోసాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. రసీదు లేకుండా వస్తువులను కొనుగోలు చేస్తే మోసపోతామనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అదే విధంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించకుండా ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైల్వే బోర్డు సభ్యుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. కరోనా మహమ్మారి పై ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల సభ్యులు దిడ్డి గోపాల్, బాలరాజు, వీరేశ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.