
పావనికి అండగా నిలిచిన రవి సోషల్ ఫౌండేషన్, నారాయణమ్మ విద్యాసంస్థలు
రూ.1.50 లక్ష ఫీజు తిరిగి చెల్లింపు.. అదనంగా రూ.50 వేల సాయం
నేడు రూ.25 వేల చొప్పున సాయం చేయనున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నీలగిరి, నవంబర్ 22 : జేఈఈలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఐదుగురు గిరిజన విద్యార్థినుల చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. అదివారం నమస్తే తెలంగాణ మినీలో ప్రచురితమైన ‘చదువుకుంటాం.. సాయం చేయండి’ వార్తకు విశేష స్పందన వస్తున్నది. ఇప్పటికే మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు కుమారుడు సిద్ధార్థ ఎన్బీఆర్ ఫౌండేషన్, కస్తూరి శ్రీ చరణ్ కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ ద్వారా ఆర్థిక సాయం అందించగా సోమవారం మరికొందరు దాతలు సాయం చేశారు. మిర్యాలగూడ మండలం బాద్యాతండాకు చెందిన ధనావత్ రెడ్యానాయక్ కూతురు పావని ఐఐటీ జోధ్‌పూర్‌లో సీటు సాధించింది. కానీ ఆమె ఇప్పటికే జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం రూ.1.35 లక్షలు ఫీజు, మొదటి సంవత్సరం ఫీజు రూ.15,500 కళాశాలలో చెల్లించి అడ్మిషన్ పొందింది. ఐఐటీ సాధించిన విషయం తెలిసిన రవి సోషల్ ఫౌండేషన్ సభ్యులు పావనిని కలిశారు. రవి సోషల్ ఫౌండేషన్ సభ్యులు, నారాయణమ్మ కళాశాల యాజమాన్యం పావనికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నారాయణమ్మ కాలేజీ యాజమాన్యం పావని సర్టిఫికెట్స్‌తోపాటు చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేసింది. అమె ఐఐటీకి అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పింది. ప్రస్తుతం ఐఐటీ కౌన్సెలింగ్‌కు అవసరమైన రూ.50వేల చెక్‌ను రవి సోషల్ ఫౌండేషన్ చైర్మన్ పాదూరి రవికాంత్‌రెడ్డి, నారాయణమ్మ కళాశాల చైర్మన్ శ్రీవిద్య సోమవారం విద్యార్థికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ విద్యార్థి ఐఐటీ చదువుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రవి సోషల్ ఫౌండేషన్ మేనేజర్ బొప్పని వెంకన్న తదితరులు ఉన్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ రూ.20 వేల చొప్పున సాయం
దేవరకొండ : నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ స్పందించి ముగ్గురు గిరిజన విద్యార్థుల సాయానికి ముందుకు వచ్చారు. సోమవారం ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూమిక, పూజిత, మమతకు రూ.20 వేల చొప్పున అందించారు.
అలాగే ఇల్లందు మార్కెట్ వైస్ చైర్మన్ లాల్‌సింగ్‌నాయక్ రూ.5 వేల చొప్పున, మరో మెకానిక్ తులసీరాంనాయక్ రూ.3వేల చొప్పున ఎమ్మెల్యే హరిప్రియానాయక్ సమక్షంలో ముగ్గురు విద్యార్థినులకు అందజేశారు.
నేడు దేవరకొండ ఎమ్మెల్యే పుట్టిన రోజు కానుకగా..
దేవరకొండ గురుకుల కాలేజీలో చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఉన్నత చదువుకు స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించేందుకు నిర్ణయించారు.