
త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు
చికిత్స, కేరింగ్, పునరావాసమే లక్ష్యంగా వైద్యసేవలు
క్యాన్సర్ రోగుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి
నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు
తగ్గనున్న చికిత్స ఖర్చులు.. దూర భారం
నల్లగొండ ప్రతినిధి, నవంబర్21(నమస్తే తెలంగాణ) :రాష్ట్రం ఏర్పాటు తర్వాత నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజావైద్యాన్ని బలోపేతం చేసిన సర్కారు దీర్ఘకాలిక రోగాలపై దృష్టి సారించింది. జిల్లాలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నది. ఇదే స్ఫూర్తిగా మరో భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడిన రోగులకు కూడా చికిత్సను చేరువ చేసేందుకు నల్లగొండ జిల్లా జనరల్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు వార్డు పనులు పూర్తి కావచ్చాయి. ఇది అందుబాటులోకి వస్తే క్యాన్సర్ రోగులకు ఇక్కడి నుంచే చికిత్స, కేరింగ్, పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇక క్యాన్సర్ రోగులకు దూరం వెళ్లే కష్టాలు తీరనున్నాయి. ఇక్కడ చేరే రోగులకు నాణ్యమైన పౌష్టికాహారం కూడా అందించి వారికి జీవితంపై మరింత భరోసా కల్పించనున్నారు.
సర్కారు వైద్యశాలలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర, అత్యంత ఖర్చుతో కూడిన వైద్యాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా జిల్లా కేంద్ర దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 112 మంది రోగులకు సేవలు అందిస్తున్నది. క్యాన్సర్ రోగులు హైదరాబాద్, విజయవాడ లాంటి పట్టణాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సర్కారు.. జిల్లా ప్రభుత్వ దవాఖానలో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసింది. దాదాపు రూ.20లక్షలతో వార్డును ఆధునీకరించగా బెడ్స్, ఇతర అవసరమైన అన్ని రకాల ఫర్నిచర్‌ను అందించి క్యాన్సర్ బాధితులకు బతుకుపై భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంది.
పౌష్టికాహారం అందజేత..
క్యాన్సర్‌తో బాధపడుతూ నిరాదరణకు గురై చివరి మజిలీలో ఉన్న రోగులకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు కార్పొరేట్‌స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. బెడ్లు, దుప్పట్లు, అవసరమైన సిబ్బంది, చికిత్స చేసేందుకు వీలైన పరికరాలను ప్రైవేటు ఆస్పత్రులకు ఏ మాత్రం తగ్గకుండా ఏర్పాటు చేశారు. స్టాఫ్ నర్సులను మూడు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించేలా నియమించారు. రోగులు ఏ సమయంలో ఏ మాత్రలు వేసుకోవాలి..? వారి ఆరోగ్యం ఎలా ఉన్నది? అనే విషయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. రోగ నిరోధక శక్తి పెరుగడానికి పౌష్టికాహారం అందించనున్నారు. ఉదయం 9 గంటల్లోపు పాలు, బ్రెడ్డు, 10 గంటలకు రాగి జావ, మధ్యాహ్నం భోజనం, రాత్రికి రాగిజావ అందించనున్నారు. ఇవి తినలేని రోగులకు లిక్విడ్ రూపంలో పౌష్టికాహారం అందించనున్నారు.
క్యాన్సర్ వార్డు సిద్ధం..
క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం జిల్లా జనరల్ దవాఖానలో ప్రత్యేకంగా వార్డును సిద్ధం చేశాం. క్యాన్సర్‌కు స్థానికంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 20 పడకలను, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. రోగులకు చికిత్స, కేరింగ్, రిహాబిలిటేషన్ పేరిట నాణ్యమైన భోజనంతో వసతి ఏర్పాటు చేయనున్నాం. వార్డుకు సంబందించి అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం.