
కోదాడటౌన్, నవంబర్ 21 : చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వనభోజన మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. బతుకమ్మ చీరెలు, పాఠశాలలు, కళాశాలకు వస్ర్తాలు సరఫరాతోపాటు పింఛన్లు, సబ్సిడీ రుణాలు అందించి నేతన్నల అర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిచ్చిందని అన్నారు. పద్మశాలీ సేవా సంఘం భవన నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ చింతా కవితారెడ్డి, పద్మశాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి గోపాల్, పట్టణాధ్యక్షుడు గోలి నాగరాజు, కార్యదర్శి రచ్చ సతీశ్, కొంగరి నరసింహారావు, నక్కా చంద్రం, రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.