
‘పుర’పాలకులకు ప్రభుత్వ గౌరవం
చైర్మన్, చైర్పర్సన్లు, కౌన్సిలర్ల వేతనాల పెంపు
జనాభా ప్రాతిపదికన 30 శాతం పెంపు
రూ.50 వేలు దాటిన చైర్మన్లకు రూ.19,500, వైస్ చైర్మన్లకు రూ.9,750, కౌన్సిలర్లకు రూ.4,550
నాగర్‌కర్నూల్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘పుర’పాలకుల సేవలకు ప్రభుత్వ గుర్తింపు లభించింది. జనాభా మేరకు ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లకు 30 శాతం మేర వేతనాలు పెంచింది. గురువారం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేలు దాటిన చైర్మన్లకు రూ.19,500, వైస్ చైర్మన్లకు రూ.9,750, కౌన్సిలర్లకు రూ.4,550, మిగతా చైర్మన్లకు రూ.15,600, వైస్ చైర్మన్లకు రూ.6,500, కౌన్సిలర్లకు రూ.3,250 పెరిగాయి. దీంతో ఆయా పురపాలికల చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పాలకుల సేవలను గుర్తించింది. కొన్నేండ్లుగా వేతనాల పెంపునకు ఎదురుచూస్తున్న మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్లు, కౌన్సిలర్ల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఆయా పాలకులకు పెరిగిన గౌరవ వేతనాలు అమలు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పల్లెలతోపాటు పట్టణాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నది. గ్రామాల్లో పల్లెప్రగతి, మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతులను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లో పారిశుధ్య చర్యలతోపాటు ఆదాయం పెంపునకు చైర్మన్లు, కౌన్సిలర్లు కృషి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు సేవ చేయడంలో ముందుంటున్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ చర్యల్లోనూ భాగస్వాములయ్యారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న నిధులతో అభివృద్ధి పనుల్లో భాగమవుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా పట్టణాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నది. మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మినీ ట్యాంక్బండ్లు, సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటిస్తూ పరిరక్షిస్తున్నారు. ఈ పనులు నాణ్యతగా జరిగేలా చైర్మన్లు, కౌన్సిలర్లు పర్యవేక్షిస్తున్నారు. పట్టణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానించి నిధులు, ఆదాయం సాధించుకునేలా పనులు చేస్తున్నారు. మున్సిపల్ ఆదాయం పెంచుకోవడం, నిధులను అవసరాల రీత్యా ఖర్చు చేయడానికి కలెక్టర్ సమక్షంలో చర్చించి బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు.
నిత్యం ప్రజలకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ద్వారా ప్రభుత్వానికి సంధానకర్తలుగా ఉంటున్నారు. ఇలా కౌన్సిలర్లు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకమవుతూనే ప్రజల కష్టసుఖాల్లోనూ రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అలాంటి కౌన్సిలర్ల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచేందుకు నిర్ణయించడం విశేషం. దీంతో రాష్ట్ర మున్సిపల్‌శాఖ 30శాతం మేర గౌరవ వేతనాలు పెంచడం గమనార్హం. ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న జనాభాను బట్టి ఈ వేతనాల పెంపును ప్రభుత్వం నిర్ధారించింది. 50వేల జనాభా దాటిన మున్సిపాలిటీల్లో చైర్మన్లకు ప్రస్తుతం రూ.15వేలు గౌరవవేతనం ఉండగా రూ.4,500పెరిగింది. ఇకపై రూ.19,500చొప్పున వేతనం రానున్నది. డిప్యూటీ చైర్మన్లకు రూ.7,500 ఉండగా రూ.2,250 చొప్పున పెరిగి రూ.9,750కి చేరనున్నది. కౌన్సిలర్లకు రూ.3,500ఉండగా రూ.4,550కి పెరిగింది. ఈ కౌన్సిలర్లకు రూ.1050చొప్పున పెరుగుతున్నది. 50వేలకంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలీటీల్లో చైర్మన్లకు రూ.12వేలు ఉండగా రూ.15,600కు చేరనున్నది. వైస్చైర్మన్లకు రూ.5వేలు ఉండగా రూ.6,500 చొప్పున పెరగనున్నాయి. కౌన్సిలర్లకు రూ.2,500ఉండగా ఇకపై రూ.3,250 చొప్పున ప్రతినెలా వేతనాలు పెరగనున్నాయి. గత సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు పెంచడంతో చైర్మన్లు, కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
పట్టణాల అభివృద్ధికి మున్సిపల్ పాలకవర్గాలు ఎంతో కృషి చేస్తున్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని అభివృద్ధి పనులు మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. ఈ పథకాల అమలును వందశాతం జరిగేలా కృషిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధిలో భాగమవుతున్నాం. మా సేవలను గుర్తించి గౌరవ వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
పెంచిన వేతనాలు అమలు
చైర్మన్లు, కౌన్సిలర్లకు పెంచిన వేతనాలు అమలవుతున్నాయి. జనాభాను దృష్టిలో ఉంచుకొని చైర్మన్లకు, వైస్చైర్మన్లకు, కౌన్సిలర్లకు వేతనాలు పెంచారు. ఇకపై ప్రతి నెల మున్సిపాలిటీలో చైర్మన్లకు నెలకు రూ.15,600, వైస్‌చైర్మన్‌కు రూ.6,500, కౌన్సిలర్లకు రూ.3,250చొప్పున వేతనాలు వస్తాయి.