
అలంపూర్, నవంబర్ 21 : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయాలను దర్శించుకున్నారు. ముందుగా తుంగభద్రా నదిలో భక్తులు స్నానాలు ఆచరించి ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు ప్రత్యేక క్యూలైన్లల్లో వెళ్లి అమ్మవారు, స్వామి వారిని శీఘ్ర దర్శనం చేసుకున్నారు.
కొనసాగుతున్న పవిత్రోత్సవాలు
ఇటిక్యాల, నవంబర్ 21 : కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా బీచుపల్లి కోదండరామాలయంలో ఆదివారం ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భువనచంద్ర శిష్యబృందం వారు ఆధ్వర్యంలో వేదదివ్య ప్రబంధపారాయణం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, వాస్తుహోమం, యాగశాల ద్వారతోరణ ధ్వజకుంభ, ఆరాధనలు, పవిత్ర అధివాసాలు, పవిత్ర ప్రతిష్ట, మూలమంత్ర హోమాలు, లఘుపూర్ణాహుతి నివేదన, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమాలను ఆలయ సహాయ మేనేజర్ రఘు పర్యవేక్షించారు.
భగవద్గీతపై ప్రచారం
కేటీదొడ్డి, నవంబర్ 21 : మండలంలోని కొండాపురం గ్రామంలో ఇందూశ్రీ ప్రసాదు త్రైత్ర సిద్ధాంత భగవద్గీతపై ఆదివారం ప్రచారం నిర్వహించారు. భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారి దివ్య ఆశీస్సులతో పలువురికి భగవద్గీత అందజేశారు. భగవద్గీతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.