
రేపటి నుంచి గట్టు జాతర
ఏర్పాట్లు చేస్తున్న ఎస్ఎస్కే సమాజ్
రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలు
అలరించనున్న తెలంగాణ ధూంధాం
హాజరుకానున్న ఎమ్మెల్యే బండ్ల
గట్టు, నవంబర్ 21: మండలకేంద్రంలోని అంబాభవానీ జాతరకు వేళైనది. మంగళవారం నుంచి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. జాతరను విజయవంతం చేయడానికి గ్రామ పంచాయతీ, సోమవంశ సహస్రార్జున క్షత్రీయ (ఎస్ఎస్కే) సమాజ్ ఏర్పాట్లు చేస్తున్నది. ఉదయం 8 గంటలకు నిర్వహించే పందిరి పూజతో వేడుకలు ఆరంభంకానున్నాయి. అదేరోజు రాత్రి 9గంటలకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. 24న కలశపూజ, బిందెసేవ, రాత్రికి రథోత్సవం, మధ్యాహ్నం కొడుమూరుకు చెందిన భక్తుడు బస్సోజీ వెంకటేశ్వర్లు అన్నదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. 25న రాత్రి పల్లకీ ఊరేగింపు, 26న జలాభిషేకం నిర్వహిస్తారు. ఉత్సవాలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆలయానికి ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతున్నది. ఉత్సవాలకు కర్ణాటకలోని బెంగళూరు, రాయిచూర్, గుల్బర్గ, మహారాష్ట్రలోని ముంబయి, అమర్నాథ్, షోలాపూర్, ఏపీలోని కర్నూల్, కోడుమూర్, గూడూరు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూర్, హైదరాబాద్, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలతోపాటు, సందెరాళ్ల పోటీలు, గ్రామ సింహాల పరుగుపందెం పోటీలు జరగనున్నాయి. విజేతలకు నగదు ప్రదానం చేయనున్నారు. స్థానిక సర్పంచ్ ధనలక్ష్మి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో తెలంగాణ ధూంధాం నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రముఖ గాయనీ మధుప్రియ, జానపద గాయకుడు శివనాగులు హాజరుకానున్నారు.