
చిన్నంబావి, నవంబర్ 21 : ఓ గ్రామంలో ఇద్దరు రైతులు, ఒక నిరుపేద వ్యవసాయ కూలీ మధ్య పొలానికి నీళ్లు పారబెట్టే విషయంలో జరిగిన గొడవను గ్రామంలోనే పరిష్కరించాల్సింది పోయి వారిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి, అనుచరగణాన్ని పోగేసి పోలీస్‌స్టేషన్‌నే ముట్టడించే విధంగా వారిని ఉసిగొల్పి.. పచ్చని పల్లెల్లో మాజీమంత్రి అనుచరులు రైతుల మధ్య చిచ్చుపెడతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చిన్నమరూరు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీ గొల్ల శివశంకర్‌పై రైతులు సద్దాంహుస్సేన్, అలీహుస్సేన్ దాడిచేసి తీవ్రంగా గాయపరచడంతో సర్పంచ్ భర్త మాజీమంత్రి అనుచరుడు తిరుమల్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయమని శివకుమార్ చెప్పి మళ్లీ ప్లేట్ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి చిన్నగొడవను పెద్దగా చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి గల్లీస్థాయికి దిగజారరని ప్రజాప్రతినిధులు విమర్శించారు. మాజీ మంత్రి తన అనుచరులతో రైతులను ఉసిగొల్పి నేడు పోలీస్‌స్టేషన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారని, తనుమాత్రం చిన్నంబావి, పెద్దమరూరు గ్రామల మధ్య రహదారిపై ఉండి తతగం నడిపించారని ఇది హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. గతంలో ఇలాగే పలు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు తరిమిన ఘటన మాజీమంత్రి మరిచారన్నారు. మళ్లీ అదే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు వ్యవసాయ పనులతో తీరిక లేకుండా పనులు చేసుకుంటుంటే, రైతుల మధ్య గొడవలు సృష్టించి వాటిని స్వప్రయోజనాలకు మలుచుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. తీవ్రగాయాలతో ఉపాధి కోల్పోయిన తనకు, కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వ్యవసాయ కూలీ శివశంకర్ ప్రజాప్రతినిధులను వేడుకున్నాడు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, ఉమ్మడి మండల టీఆర్ఎస్ వ్యవహారాల ఇన్చార్జి గోవిందుశ్రీధర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మద్దిలేటి, సర్పంచులు చక్రధర్‌గౌడ్, విండో డైరెక్టర్ డేగశేఖర్యాదవ్, నాయకులు చిన్నారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, జయగౌడ్, గోపినాయుడు, జేవీకేనాయుడు, నారాయణ, ఉగ్రనర్సింహ, వ్యవసాయ కూలీ శివశంకర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.