పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచనలు
పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు
మంత్రికి రూ.2 కోట్లు, కలెక్టర్‌కు రూ.కోటి కేటాయిస్తున్నట్లు వెల్లడి
ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని నిర్దేశం
కరీంనగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): వచ్చే నెలలో చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శనివారం కలెక్టర్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమావేశమై పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో చేపట్టనున్న పనులపై ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్లు శశాంక, రవి, డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, కృష్ణభాస్కర్ నివేదిక సమర్పించారు. కాగా, పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తున్నా పనులు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని సీఎం ప్రశ్నించారు. వచ్చే నెల 1 నుంచి పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్న ప్రకటించారు. మంత్రులకు రూ.2 కోట్లు, కలెక్టర్లకు రూ.కోటి చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించే సీడీఎఫ్ నిధులను కూడా మంత్రి అప్రూవల్ తీసుకుని ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి నాటించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో ఒక చోట 10 ఎకరాల భూమిలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న అన్ని శాఖల రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసుకుని వారి సేవలను పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పట్టణంలో కనీసం నాలుగైదు చోట్ల డంప్ యార్డులు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించాలన్నారు. కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లే అవుట్లకు అనుమతించరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
జూలై చివరికల్లా ప్రభుత్వ శాఖల మధ్య పేరుకుపోయిన పరస్పర బకాయిలను బుక్ అడ్జెస్టు ద్వారా పరిష్కరించుకోవాలని, ఇక నుంచి అన్ని శాఖల నడుమ విధిగా వెంట వెంటనే బిల్లులు చెల్లించుకోవాలని సూచించారు. గ్రామాల్లో విద్యుత్తు సమస్యను అధిగమించడానికి పవర్ డేను పాటించాలని, ప్రజలను చైతన్య పర్చి శ్రమదానంలో పాల్గొనే విధంగాఇ చేడాలనిలని సీఎం స్పష్టం చేశారు.