
ఒకప్పుడు వలస బాటలో ఉమ్మడి జిల్లా
నేడు ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి మన దగ్గరికి..
ఈ సీజన్లో ఇప్పటికే 5వేల మందికిపైగా రాక
ప్రస్తుతం పత్తి ఏరే పనులతో ఉపాధి
రోజూ 500 నుంచి 700 వరకు కూలి
పెరిగిన సాగు విస్తీర్ణంతో పుష్కలంగా పనులు
రైతులకు తగ్గుతున్న కూలీల కొరత
నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మన ఎవుసం నేడు కొత్త పుంతలు తొక్కుతున్నది. ఒకనాడు నీళ్లు లేక, కరంటు రాక, నెర్రెలు వారిన నేలపై ఉపాధి దొరక్క రోజుకూలీలేగాక, రైతులు సైతం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన దుస్థితి.నేడు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు విస్తీర్ణం ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు పెరిగి.. 21.58లక్షలకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరిగిన నీటి వసతులతో సాగు సస్యశ్యామలమైంది. కూలీలకు చేసుకున్నంత పని దొరుకుతున్నది.నాలుగేండ్లుగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి మన దగ్గరికి వలసలు పెరుగుతున్నాయి. కుటుంబాలకు కుటుంబాలు దసరా అనంతరం వచ్చి డిసెంబర్ మధ్య వరకు ఇక్కడే తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని ఉంటున్నాయి. ఈ సీజన్లో మునుగోడు, దేవరకొండ, నాగార్జునసాగర్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాలకు ఇప్పటికే 5వేల మందికిపైగా పనుల కోసం వచ్చినట్లు అంచనా. వారంతా ప్రస్తుతం పత్తి ఏరి ఉపాధి పొందుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 సంవత్సరంలో 13.16లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా నేడు 21.58లక్షలకు పెరిగింది. ఈ ఏడేండ్లల్లో 8.50 లక్షల ఎకరాల్లో సాగు పెరుగడం గమనార్హం. నాడు 4.50లక్షల ఎకరాల్లో వరి, 8.61లక్షల ఎకరాల్లో పత్తి, కంది, పెసర సాగయ్యేవి. నాటి నుంచి ఏటా లక్ష ఎకరాలకు పైగా పెరిగి ప్రస్తుతం 21.58 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వానకాలంలో కేవలం వరి సాగే 11.90 లక్షల ఎకరాలకు విస్తరించడం గమనార్హం. పత్తి 8.76 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వ్యవసాయ ప్రోత్సాహక పథకాల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ద్వారా గోదావరి జలాలు, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరించడంతో 1.18లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి వసతి తోడైంది. వరి సాగు సుమారు మూడు రెట్లు పెరిగింది.
పత్తి చేలల్లో వలస కూలీలకు ఉపాధి
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 6.52లక్షల ఎకరాల్లో ఈ సీజన్లో పత్తి సాగైంది. సుమారు 45.68లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా. సూర్యాపేట జిల్లాలో 98వేల ఎకరాల్లో సాగు చేయగా 6.50లక్షల క్వింటాళ్ల దిగుబడి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1.26లక్షల ఎకరాల్లో సాగు కాగా మొత్తం 10లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రావచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పత్తి చేలల్లో ఆరంభం నుంచే కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. కలుపుతీత లాంటి పనులకు స్థానిక కూలీలు సరిపోతున్నారు. కానీ, పత్తి ఏరడంలో మాత్రం కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో రైతులు స్థానిక కూలీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ పిలిపించుకుంటున్నారు. నాలుగైదేండ్లుగా యేటా కర్నూల్, అనంతపురం, ఒంగోలు జిల్లాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. దసరా తర్వాత వచ్చి డిసెంబర్ నెలాఖరులో తిరుగుముఖం పడుతున్నారు. ఓ అంచనా ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదు వేల మంది వలస కూలీలు పత్తి చేలల్లో పనిచేస్తున్నారు.
అక్కడ ఉపాధి, కూలీ తక్కువ…
కర్నూల్, అనంతపూర్, ఒంగోలు జిల్లాలో ఈ సీజన్లో పంటలు సరిగ్గా లేక దిగుబడి కూడా తగ్గిపోయిందని ఆయా జిల్లాల నుంచి వచ్చిన కూలీలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహం లేకపోవడంతో వ్యవసాయం తగ్గిపోయి కూలీలకు ఉపాధి కొరవడింది. పని తక్కువ, కూలీలు ఎక్కువ ఉండడంతో కూలి రేట్లుపడిపోయాయి. రోజంతా కష్టపడ్డా రూ.200 నుంచి 300 మాత్రమే గిట్టుబాటు అవుతున్నది. అది కూడా నిత్యం పని దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో వలసలు పెరిగాయి. గ్రామాల్లో కొందరు మేస్త్రీలు ఆంధ్రా నుంచి కూలీలను రప్పించి పనులు చేయిస్తున్నారు.
కూలి గిట్టుబాటు..
కిలో పత్తి తీస్తే కొన్ని చోట్ల రూ.10 నుంచి 12, మరికొన్ని చోట్ల 12 నుంచి 14రూపాయల వరకు రైతులు చెల్లిస్తున్నారు. మధ్యవర్తులు ఉంటే వారు రెండు నుంచి నాలుగు రూపాయల కమీషన్ తీసుకుంటున్నారు. చేలపై పత్తి నిండుగా ఉండే ఒక్కో కూలీ రోజూ 80 నుంచి 100 కేజీల పత్తిని ఏరుతాడు. కానీ దిగుబడి తక్కువగా ఉంటే 50 నుంచి 60కిలోల పత్తిని తీయగలరు. ఇలా రోజూ సగటున కనీసం 500 నుంచి 600 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. రెండు నెలల పాటు భార్య భర్తలు కలిపి 60 నుంచి 80వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. వీరంతా మళ్లీ మార్చి, ఏప్రిల్ నెలల్లో వేరుశనగ పంట తీసేందుకు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చందంపేట, డిండి, నేరడుగొమ్ము మండలాలకు తిరిగి వస్తారు.
రైస్ మిల్లులో బీహార్ కూలీలకు ఉపాధి
మిర్యాలగూడ టౌన్, నవంబర్ 20 : మిర్యాలగూడ రైస్‌మిల్లుల్లో బీహార్ ప్రాంతం నుంచి వలస వచ్చిన సుమారు 2,500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. పదేండ్ల క్రితం రైస్ మిల్లుల ఉత్పత్తి సామర్థ్యం ఒక సీజన్లో 20వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ మాత్రమే ఉండేది. కానీ ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా మిల్లుల సంఖ్య, సామర్థ్యం కూడా పెరిగింది. ప్రస్తుతం సీజన్లో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యం వల్ల ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతున్నది. అందుకే ఇతర రాష్ర్టాల నుంచి కుటుంబాలతో సహా వలస వచ్చి స్థిరపడుతున్నారు.