
అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష
రాజోళి, నవంబర్ 20 రాజోళిలోని ఆయా పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రాజోళిలో శనివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. తెలుగుపేట పాఠశాలను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న గదుల పనులను పూర్తి చేయాలన్నారు. జెడ్పీహెచ్ఎస్, బాలుర వసతి గృహాల్లో శిథిలమైన గదులను తొలగించాలని, ప్రహరీలను నిర్మించాలని, వాటి కోసం ప్రతిపాదనలను తనకు పంపాలని సూచించారు. వైకుంఠ నారాయణస్వామి, గంగమ్మ గుడి వద్ద నిర్మించిన పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. 2022-23 హరితహారానికి సంబంధించిన పనులపై అధికారులతో చర్చించారు. . తూర్పు గార్లపాడులో ఇసుక డంపులను పరిశీలించి వివరాలు తెలసుకున్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ జోషి శ్రీనివాస్ శర్మ, ఎంపీడీవో గోవిందురావు, ఉప సర్పంచ్ గోపాల్, పీఆర్ఏఈ నరేశ్ తదతరులు పాల్గొన్నారు.
బృహత్ ప్రణాళిక పనులు పూర్తిచేయాలి
మల్దకల్, నవంబర్ 20: జిల్లాలోని అన్ని మండలాల్లో మండల బృహత్ ప్రణాళికలు భాగంగా పల్లె ప్రకృతి వనం పనులు పూర్తయినా మల్దకల్ మండలంలో పనులు పూర్తి కాకపోవడమేమిటని అదనపు కలెక్టర్ శ్రీహర్ష , ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని కుర్తిరావులచెర్వు గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల్లో మొదలుపెట్టి వదిలేసిన పనులను ఆయన పరిశీలించారు. పనులు ఎందుకు నిలిపివేశారని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులతో మాట్లాడి తొందరగా పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేయకుండా సాకులు చెప్పవద్దని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సూ చించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో కృష్ణయ్య, సర్పంచ్ జయమ్మ, నాయకులు లక్ష్మన్న పాల్గొన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గ్రామంలో పలు వీధుల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడుత, రెండో విడుత వ్యాక్సినేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలోఅనుకున్న స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులతో కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో మండలానికి మళ్లీ వస్తానని అంతవరకు రెండో విడుత వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, సర్పంచ్ యాకోబు, కార్యదర్శి మాబీ, ఉప సర్పంచ్ మల్దకల్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.