e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home జిల్లాలు వంద కోట్ల ప్యాకేజీ తెచ్చి ఓట్లడగాలె

వంద కోట్ల ప్యాకేజీ తెచ్చి ఓట్లడగాలె

దమ్ముంటే దళితబంధులో 50 శాతం షేర్‌ఇవ్వాలె..
దేశమంతా అమలు చేయించాలె..
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

హుజూరాబాద్‌, అక్టోబర్‌ 20 (నమస్తే తెలంగాణ) : ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యమిచ్చిండు. కానీ, ఆయన కాపాడుకోలేకపోయిండు. ఉన్నన్నీ రోజులు ఏ పనీ చేయలేదు. ఇప్పుడేమో నేనే అది చేసినా.. ఇది చేసినా అంటున్నడు. అయినా ఏదైనా చేస్తే ఏడేండ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లో ఉండే కదా? నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు చేయాలె. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా? హుజూరాబాద్‌ అభివృద్ధి కోసం రూ.వంద కోట్ల ప్యాకేజీ తెచ్చి మాట్లాడాలె. ముదిరాజ్‌నని చెప్పుకొనే ఆయన ఆ కులస్తుల సమస్యలపై ఏనాడూ మాట్లాడలేదు. ఎన్నికలు వస్తేనే వాళ్లు ఆయనకు గుర్తుకు వస్తరు. బీజేపీ నేతలకు దమ్ముంటే దళితబంధుకు కేంద్రం నుంచి 50 శాతం షేర్‌ఇవ్వాలె. ఈ పథకాన్ని దేశమంతటా అమలు చేయాలె. అప్పుడే హుజూరాబాద్‌లో ఓట్లడగాలె. గెల్లు సీను గెలిస్తే హుజూరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తం.

కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనని, ఆ పార్టీ నాయకులు రూ.వంద కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చి ఓట్లు అడగాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. ఏదీ లేకుండా.. రేపు గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుడు సరికాదని హితవు పలికారు. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుకు కేంద్రం నుంచి 50 శాతం షేర్‌ ఇవ్వాలని కోరాలని, దేశమంతటా అమలు చేయాలని సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం మత్స్యకారులతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 1.14 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరో రెండు మూడు నెలల్లో 60 నుంచి 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వస్తుందని చెప్పారు. సీఎం కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా ముదిరాజులు, గంగపుత్రులకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 46 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తున్నదనన్నారు.

- Advertisement -

22 కోట్లతో ప్రారంభమైన ఉచిత చేపల పంపిణీ ఇప్పుడు 93 కోట్లకు చేరుకున్నదని చెప్పారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేపలు ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారని, చెరువులపై పూర్తి అధికారాన్ని మత్స్యకారులకే కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ ఏది చేసినా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ, ఈటల రాజేందర్‌ ముదిరాజుల గురించి ఏనా డూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్నప్పుడే ప్రజలు ఏదైనా పని కావాలని అడిగితే అది తన చేతిలో లేదని తప్పించుకున్నాడని, ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తడని ప్రశ్నించారు. ఆయన గెలిస్తే ఇక్కడి ప్రజలకు మరోసారి అన్యాయం జరుగుతుందన్నారు. అధికార పార్టీ అభ్యర్థి గెల్లు గెలుస్తాడా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయని, నాగార్జున సాగర్‌లో జానారెడ్డిపై యువకుడైన నోముల భగత్‌ గెలిచాడా? లేదా? అని అడిగారు. రాజేందర్‌ జానారెడ్డి కంటే గొప్పవాడు కాదని, ఆయనపై గెల్లు సీను గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. గెల్లు గెలిస్తే హుజూరాబాద్‌ ఇంతకన్నా రెట్టింపు అభివృద్ధి అవుతుందని చెప్పారు. గెల్లును గెలిపిస్తే తామంతా వెంట ఉండి హుజూరాబాద్‌ను అభివృద్ధి దిశగా నడిపిస్తామని హామీ ఇచ్చారు.

మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కృషి:రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌
ముదిరాజ్‌ల కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ తెలిపారు. రూ.25 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు యూనిట్లు ఏర్పాటు చేసి మత్స్యకారులకు సబ్సిడీపై అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. చెరువులపై పంచాయతీల పెత్తనాన్ని రద్దు చేసి, మత్స్య శాఖకే అప్పగిస్తూ సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పేదలకు వ్యతిరేకమైన బీజేపీని దగ్గరకు రానీయవద్దని సూచించారు. దేశంలోని 36 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని, మరి కొద్ది రోజుల్లో జమ్మికుంట రైల్వే స్టేషన్ను అమ్మకానికి పెట్టినా ఆశ్చర్యపోనక్కర లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌తోనే పేదల బతుకుల్లో వెలుగులు నిండుతాయని, పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, నోముల భగత్‌ యాదవ్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కేడీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పింగళి రమేశ్‌, నాయకులు పోలు లక్ష్మణ్‌, పోలు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement