e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home జిల్లాలు టీఎస్‌ పీఎస్సీ సభ్యురాలిగా సుమిత్రానంద్‌

టీఎస్‌ పీఎస్సీ సభ్యురాలిగా సుమిత్రానంద్‌

టీఎస్‌ పీఎస్సీ సభ్యురాలిగా సుమిత్రానంద్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఉద్యమకారిణికి దక్కిన అరుదైన గౌరవం
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
ప్రస్తుతం తెలుగు పండిత్‌గా సేవలు
సాహిత్యరంగంలోనూ తనదైన ముద్ర

కామారెడ్డి, మే 19: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యురాలిగా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన సుమిత్రానంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె లింగంపేట జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే పలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఆమె.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్‌, కవితతో ఉద్యమ కార్యాచరణపై సైతం పలుమార్లు చర్చించారు. పలు రచనలతో సాహిత్య రంగంలో గుర్తింపు సాధించారు. టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా నియమించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సుమిత్రానంద్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులను కేసీఆర్‌ తప్పక గుర్తిస్తారని చెప్పడానికి తన నియామకమే నిదర్శనమని ఆమె అన్నారు.

ఉద్యమ నేపథ్యం ఉన్న సుమిత్రానంద్‌కు రాష్ట్రస్థాయిలో తగిన గుర్తింపు లభించింది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన సుమిత్రానంద్‌ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె లింగంపేట జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎంఏ(తె లుగు), తెలుగు పండిత్‌ శిక్షణ పూర్తి చేసిన ఆమె తెలుగు పండిత్‌గా సేవలందిస్తున్నారు. ప్రభు త్వం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.జనార్దన్‌రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కామారెడ్డికి చెందిన సుమిత్రానంద్‌ను నియమించారు. రాష్ట్ర సాధన కో సం జరిగిన ప్రతి ఉద్యమంలోనూ పాల్గొని తనవంతు సేవలను అందించారు. ఉద్యోగినిగా సిద్దిపేటలో నిర్వహించిన ఉద్యోగ గర్జన సభలో పాల్గొన్నారు. ఉద్యమకారులను గుర్తించి సరైన సమయంలో వారికి న్యాయం చేస్తారనడానికి ఆమె నియామకం ఒక నిదర్శనం.

గుర్తింపు నివ్వడం ఆనందంగా ఉంది..
తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న తనను గుర్తించి ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా నియమించడంపై సీఎం కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఉద్యమకారులను కేసీఆర్‌ విస్మరించరని చెప్పడానికి తన నియామకమే నిదర్శనమన్నారు.

వ్యక్తిగత పరిచయం..
సుమిత్రానంద్‌ మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం ఆరెపల్లి గ్రామంలో విఠాబాయి – మాణిక్‌రావు దంపతులకు 15 మే 1970లో జన్మించారు. పాఠశాల విద్య, ఇంటర్‌ పూర్తి చేసిన అనంతరం కామారెడ్డిలోని ఓరియంటల్‌ కాలేజీలో బీవోఎల్‌ పూర్తి చేశారు. ఎంఏ(తెలుగు), తెలుగు పండిత్‌ శిక్షణ పూర్తయిన తర్వాత మెదక్‌ జిల్లాలో తెలుగు పండిత్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం అంతర్‌ జిల్లా బదిలీల్లో ఉమ్మడి జిల్లాకు బదిలీపై వచ్చారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన తానోబా ఆనంద్‌రావుతో వివాహం జరిగింది. చిన్నమల్లారెడ్డి గ్రామంలో విద్యాభివృద్ధి కోసం భర్తతో కలిసి కృషి చేస్తున్నారు.

ఉద్యమ శ్రేణులతో సత్సంబంధాలు..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా నియమితులైన సుమిత్రానంద్‌ సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న నేపథ్యం ఆమె సొంతం. సారా వ్యతిరేక ఉద్యమంలో ఆమె పనిచేశారు. అనేక సామాజిక ఉద్యమాలతో పాటు సాహితీపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కవయిత్రిగా, రచయితగా పలు కవితలు, రచనలు చేసి సాహితీరంగంలో సేవలందించారు. ప్రస్తుతం సుమిత్రానంద్‌ తెలంగాణ రచయితల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల కమిటీ, ఆర్‌టీఏ జిల్లా సభ్యురాలిగా సేవలందించారు. జిల్లాలో సర్పంచులకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌పర్సన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె తెలంగాణ భాషావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తన సామాజిక వర్గమైన ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీఎస్‌ పీఎస్సీ సభ్యురాలిగా సుమిత్రానంద్‌

ట్రెండింగ్‌

Advertisement