రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 18 :కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనబోమని చెబుతున్న నేపథ్యంలో ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 1530 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసులు, చిరుధాన్యాల పంటలు వేయాలని వివరిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరి సాగు చేసే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఫరూఖ్‌నగర్, కేశంపేట, నందిగామ మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. కందులు, వేరుశనగ, పెసర, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయల పంటలు సాగు చేసి లాభాలు పొందాలని రైతులకు అవగాహన కల్పించారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఇతర పంటల సాగుకు అధిక మొత్తంలో ప్రభుత్వం సబ్సిడీని అందిస్తున్నదని పేర్కొంటున్నారు. జిల్లాలో 15 రోజులుగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యవసాయ అధికారులకు రైతాంగం నుంచి సానుకూల స్పందన లభిస్తున్నది.
వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా ఇతర పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ.. రైతులకు అండగా నిలుస్తున్నది. అధిక మొత్తంలో సబ్సిడీని అందిస్తున్నది. విత్తనాల కొనుగోలు తదితరాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. వరి పంటను సాగు చేసే ప్రతీ రైతు ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పప్పుదినుసులు, చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా ఈ పంటలను సాగు చేస్తే అధిక లాభాలను ఆర్జించడంతోపాటు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశాలున్నాయని జిల్లా రైతాంగానికి సూచిస్తున్నారు.
జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు
వరికి బదులుగా ఇతర పంటల సాగుతో కలిగే ప్రయోజనాలకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పదిహేను రోజులుగా జిల్లాలోని రైతు వేదికలతోపాటు గ్రామ పంచాయతీ భవనాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద రైతులకు ఇతర పంటలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్రం ధాన్యాన్ని సేకరించబోమని చెప్పిన దృష్ట్యా రైతులెవరూ యాసంగిలో వరి సాగువైపు వెళ్లొద్దని, కందులు, వేరుశనగ, పెసర, పొద్దుతిరుగుడు, నువ్వులు, కూరగాయల పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరి సాగు చేసే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఫరూఖ్‌నగర్, కేశంపేట, నందిగామ మండలాల్లో జిల్లా వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 1530 కార్యక్రమాలను నిర్వహించారు.
సారు మాటే శిరోధార్యం
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృత ప్రచారానికి రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నది. సీఎం సారు మాటే మాకు శిరోధార్యం.. మేం ఇతర పంటలనే సాగు చేస్తామని అధికారులు చెబుతున్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. యాసంగి సీజన్లో 40 వేల ఎకరాల్లో వరి సాగువుతుందని అంచనా వేసినప్పటికీ ఏ ఒక్క రైతు కూడా వరి సాగు చేయకుండా అవగాహన కల్పించడంతోపాటు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇతర పంటలపై జిల్లా అంతటా అవగాహన