మోమిన్‌పేట, డిసెంబర్ 18 : గ్రామంలోని మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్యటించి గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. కరెంట్, మిషన్ భగీరథ నీటి సమస్యలు, మురుగు కాలువలు, రెవెన్యూ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం ‘మీతో నేను’ కార్యక్రమంతో ప్రజల్లోకి వస్తున్నానన్నారు. మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరిచేయాలని, నీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు కోరిన విధంగా పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలన్నారు. ఇనుప స్తంభాలు వెంటనే తొలగించాలని, వీధి దీపాలకు ఆన్ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేసి, కరెంట్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. రెవెన్యూ సమస్యలపై ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఆప్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, క్రమశిక్షణ అంశాలను తెలుసుకున్నారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తున్నదని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమాల్లో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్, సర్పంచ్ల సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, గోవిందపురం సర్పంచ్ ఆశమ్మ, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.