రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాకు అగ్రస్థానం
లక్ష్యం రూ.7.52కోట్లు
ఇప్పటివరకు వసూలైంది రూ.6.90కోట్లు
జనవరి 15వ తేదీ వరకు వంద శాతం పూర్తికి చర్యలు
పరిగి, డిసెంబర్ 15 :2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 92.73శాతం పన్నులను అధికారులు వసూలు చేశారు. జిల్లాలో 18 మండలాల పరిధిలో 566 గ్రామపంచాయతీలుండగా.. 1,83,136 కుటుంబాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7,52,06,615 పన్ను రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.6,90,52,446 రాబట్టారు. ఇంకా రూ.61,54,169 వసూలు కావాల్సి ఉండగా.. వచ్చేనెల 15వ తేదీ లోపు పూర్తిచేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. దౌల్తాబాద్, బషీరాబాద్ రెండు మండలాల్లో ఇప్పటికే నూరు శాతం పన్ను వసూలు కాగా, 12 మండలాల్లో 90 శాతానికి పైగా పన్ను రాబట్టారు.
స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరులు పన్నుల వసూళ్లు. ఓ వైపు ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులకు తోడు స్థానికంగా వసూలు చేసే పన్నులతో అభివృద్ధి జరుగుతుంది. స్థానిక సంస్థల్లో పన్నుల వసూళ్లలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 92.73శాతం పన్నుల వసూలు ద్వారా జిల్లా మేటిగా నిలిచింది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 566 గ్రామపంచాయతీల్లో 1,83,136 కుటుంబాలు ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.7,52,06,615 పన్నుల రూపంలో వసూలవ్వాల్సి ఉన్నది. అందులో పన్నులు రూ.6,87,77,584, ఇతర పన్నులు రూ.64,29,031 వసూలు చేయాల్సి ఉన్నది. ఇందులో ఇప్పటివరకు మొత్తం రూ.6,90, 52,446 వసూలు చేశారు. ఇంకా రూ.61,54,169 వసూలు చేయాల్సి ఉన్నది. ఇందుకుగాను 2022 జనవరి 15వ తేదీలోపు వసూళ్లకు అధికారులు ఆదేశించారు. పూర్తిస్థాయిలో వంద శాతం పన్నుల వసూలుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా జిల్లాలోని 566 గ్రామపంచాయతీలకు సుమారు రూ.10కోట్లు విడుదల చేస్తున్నది. ఈ నిధులకు తోడుగా పన్నుల వసూలుతో మరింత అభివృద్ధి జరుగుతున్నది.
పన్నుల వసూలులో అగ్రస్థానం..
పన్నుల వసూలులో వికారాబాద్ జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇంటిపన్నులు, నల్లా బిల్లులు, ఇతర విభాగంలో లైసెన్సుల జారీ, రెన్యువల్, తైబజార్ వేలంపాట ద్వారా ఆదాయం, ఇండ్ల నిర్మాణ అనుమతులు, వివాహాల రిజిస్ట్రేషన్ ఫీజు, మ్యుటేషన్లు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇలా వివిధ రకాలుగా స్థానిక సంస్థలకు ఆదాయం చేకూరుతున్నది. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ప్రతినెలా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నది. మరోవైపు పల్లె ప్రగతితో అనేక కార్యక్రమాల వల్ల స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నది. దీనికితోడు పన్నుల వసూలును పూర్తిస్థాయిలో చేపట్టడం ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పన్నుల వసూళ్లతో స్థానిక సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ప్రతినెలా అందజేయడంతోపాటు ఇతర నిర్వహణ ఖర్చులకు వినియోగం, మిగతా వాటితో ఆయా గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది.
రెండు మండలాల్లో వందశాతం వసూలు..
వికారాబాద్ జిల్లా పరిధిలోని దౌల్తాబాద్, బషీరాబాద్ రెండు మండలాల్లో పన్నుల వసూలు ఇప్పటికే 100శాతం పూర్తయింది. మొత్తం 18 మండలాలుండగా రెండు మండలాలు వంద శాతం వసూలు లక్ష్యం పూర్తవగా, 12 మండలాల పరిధిలో 90శాతం పైగా పన్నుల వసూలు చేపట్టారు. పన్నుల వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఏదైనా అనుమతుల కోసం వచ్చినప్పుడు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించాలని సూచించడంతోపాటు ప్రతి ఇంటి యజమాని పన్ను చెల్లించేలా చైతన్యవంతం చేస్తున్నారు. జిల్లాలో సరాసరిగా 92.73శాతం పన్నులు వసూలు జరుగడంతో మిగతా పన్నుల వసూలు జనవరి 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా పన్నుల వసూలు కార్యక్రమం కొనసాగుతున్నది. గడువు లోపు వందశాతం పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లపై దృష్టి కేంద్రీకరించారు.
రాష్ట్రంలోనే అగ్రస్థానంలో జిల్లా
పన్నుల వసూలులో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి వసూలు చేయాల్సిన పన్నుల్లో ఇప్పటివరకు 92.73శాతం పన్నులు వసూలు చేశాం. జనవరి 15వ తేదీ లోపు వంద శాతం వసూలు లక్ష్యం పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఇందుకుగాను పన్నుల వసూలు చేపట్టాలని సూచించాం.