మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
సుమారు కోటీ యాభై లక్షల నిధులతో అభివృద్ధి పనులు
షాద్‌నగర్‌రూరల్, డిసెంబర్ 15 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన నాయకులు, అధికారులు ఆ దిశగా జడ్పీ నిధులు వెచ్చిస్తున్నారు. జడ్పీ నిధులతో ఫరూఖ్‌నగర్ మండలంలోని గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. సీసీ రోడ్లు, అంతర్గత మురుగుకాల్వలు పూర్తయ్యాయి.
అభివృద్ధి కోసం రూ. కోటీ 50 లక్షల నిధులు
ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే జడ్పీ నిధుల నుంచి కోటీ యాభై లక్షల నిధులు వెచ్చించారు. సీసీ రోడ్లు, మహిళా సమాఖ్య భవనాలు, అంతర్గత మురుగుకాల్వలు ఇలా వివిధ అభివృద్ధి పనులతో పాటు పాఠశాలల అభివృద్ధికి జడ్పీనిధులను వెచ్చించారు. అంగన్వాడీ నిర్మాణానికి రూ.10 లక్షలు లింగారెడ్డిగూడ, కొండన్నగూడ, అయ్యవారిపల్లి, కందివనం, గిరాయికుంటతండా, చిన్నచిల్కమర్రి గ్రామాల్లో అంతర్గత మురుగుకాల్వల నిర్మాణానికి గ్రామానికి రూ.4 లక్షలు, అదేవిధంగా మొగిలిగిద్ద, వెంకట్‌రెడ్డిపల్లి, బుర్గుల, చిల్కమర్రి, శేరిగూడ, వెంకమ్మగూడ, మేళ్లగూడలో అండర్ డ్రైనేజీల కోసం గ్రామానికి రూ.3 లక్షలు, బీమారం, కంసాన్పల్లి, పుల్చర్లకుంట తండా, చింతగూడ గ్రామాల్లో గ్రామానికి రూ.2 లక్షలు చొప్పున వెచ్చించారు. కంసాన్పల్లి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.2 లక్షలు, దీంతో పాటు చించోడ్ దవాఖానకు రూ.10లక్షలు, విఠ్యలలో దవాఖాన నిర్మాణానికి రూ. 5 లక్షలు వెచ్చించారు. లింగారెడ్డిగూడ, చించోడ్ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, మండలంలోని 13 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల అభివృద్ధ్దికి రూ.32.50లక్షల వెచ్చించారు.